calender_icon.png 23 January, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెల్లుబికిన ప్రజాగ్రహం

22-01-2025 10:21:14 PM

గ్రామసభలో కాంగ్రెస్ నేతలను నిలదీసిన జనం

పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం...

రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరంచెరువులో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో జనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై పలువురు మహిళలు మండిపడుతూ నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల గురించి అడిగారు. వంద రోజుల్లో ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుకోళ్ల నాగరాజు, సుమారు వెయ్యి మహిళలతో కలిసి వారిని నిలదీశారు. దీంతో మేయర్ ప్రతినిధి అతాప్రేమ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వారినుంచి మైకు లాక్కున్నారు. దీంతో మీరు రాజకీయం చేయడానికి వచ్చారా.. అని మేయర్ ప్రతినిధి దౌర్జన్యం చేశారని ఆరోపించారు.

తాము బీఆర్ఎస్ నాయకులు ఐదారుగురు ఉన్నామని, కాంగ్రెస్ నాయకులు వందలాదిమంది ఉండి తమపై దాడికి యత్నించేందుకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసి వేశారని ఆరోపించారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, భారీ స్థాయిలో సిబ్బందిని తీసుకొని ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాల నాయకులను సముదాయించారు. తాము గొడవపడటానికి రాలేదని, ప్రజల తరపున ప్రశ్నించేందుకు వచ్చామని బీఆర్ఎస్ నేత నాగరాజు తెలిపారు. కాంగ్రెస్ నేతలు తమను బెదిరించారని ఆరోపించారు. లబ్దిదారులకు చెప్పుడు పథకాలు అందిస్తారని ప్రశ్నించారు. వెంటనే పథకాలు అండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము జనం తరపున పోరాటం చేస్తామన్నారు. పోలీసులు అందరినీ సముదాయించారు. బూటకపు హామీలు ఇచ్చి జనాన్ని చూసం చేసే అధికారంలోకి వచ్చారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోకుండా ఆందోళనకు దిగారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలం వెళ్లదీస్తోందని ధ్వజమెత్తారు. జనాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సర్వేల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని విమర్శించారు. ఉత్తిత్తి సర్వేలు ఎందుకని మండిపడ్డారు. బూటకపు హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ సర్కారుకు జనం బుద్దిచెబుతారని తెలిపారు. ప్రత్యక్షంగా ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మైకు లాక్కొని ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సబబు అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలం వెల్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. మేయర్ ప్రతినిధి, కాంగ్రెస్ నేతల దౌర్జన్యం సరికాదని బీఆర్ఎస్ నేత నాగరాజు పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.