calender_icon.png 21 January, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరలిపోతోన్న బీరుట్ ప్రజలు

22-10-2024 03:06:01 AM

  1. దాడులతో భీతిల్లి సురక్షిత ప్రాంతాలకు వలస
  2. హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
  3. ముందే హెచ్చరికలు చేసిన ఐడీఎఫ్ ప్రతినిధి 
  4. ప్రాణభయంతో ఇరాన్‌కు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్

టెల్‌అవీవ్, అక్టోబర్ 21: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్, హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చినా ఇజ్రాయెల్ గాజా, లెబనాన్‌లో దాడులు ఆపడం లేదు. సిన్వర్ మరణం తర్వాత ప్రతీకార దాడులు తప్పవని హెజ్బొల్లా హెచ్చరించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులకు సిద్ధమైంది.

ఈ సారి హెజ్బొల్లా ఆర్థిక మూలాలే లక్ష్యంగా బీరుట్‌లో దాడులు చేస్తామని, ఏ క్షణమైనా పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్న అల్ ఖుర్ద్ అల్ హసన్ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, ఆ పరిసరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ సూచించారు. 

ప్రజల వలస బాట

ఇజ్రాయెల్ హెచ్చరించిన వెంటనే బీరుట్ శివారు ప్రాంతాల్లోని దాదాపు 11 ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. నగరంలోని విమానాశ్రయం సమీపంలోనూ దాడులు జరిగాయి. దీంతో బీరుట్‌లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.

ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్ ఖుర్ద్ అల్ హసన్ అనేది అనుమతి లేని మార్కెట్ బ్యాంక్. ఇది హెజ్బొల్లాకు ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది. లెబనాన్‌లో దీనికి 30 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో 15 బ్రాంచీలు నగరంలోని రద్దీ ప్రదేశాలు, నివాస సముదాయాల్లోనే ఉండటం గమనార్హం. 

పరారీలో హెజ్బొల్లా డిప్యూటీ 

లెబనాన్‌లో హెజ్బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా కీలక నేతలు మరణించారు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నయీయ్ ఖాసీం ప్రాణభయంతో లెబనాన్‌ను వదిలి ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ఖాసీం అక్టోబర్ 5వ తేదీనే ఇరాన్‌కు వెళ్లినట్లు యూఏఈకి చెందిన ఓ వార్త సంస్థ కథనం ప్రసారం చేసింది.