రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు వాసాల శంకర్
మందమర్రి (విజయక్రాంతి): బొగ్గు గనుల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన కార్మికులకు చెల్లిస్తున్న పెన్షన్ ను పెంచాలని రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు వాసాల శంకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో పనిచేసి మెడికల్ అన్ ఫిట్, సహజంగా రిటైర్డ్ అయిన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. సింగరేణిలో విధులు నిర్వహించి 2021 జులై తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డ్ ద్వారా చెల్లించవలసిన పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు. గోదావరిఖని సీఎం పీఎఫ్ కార్యాలయం పరిధిలో ఐదువేల మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారని కొత్త పెన్షన్ పొందక పాత పెన్షన్ ఇవ్వడం వలన చాలీచాలని పెన్షన్ తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ సంస్థ అయిన అంబికా దర్బార్ బత్తి సంస్థలో 15 సంవత్సరాలు పని చేసిన కార్మికులకు 150 గజాల ఇల్లు స్థలాన్ని ఇస్తున్నారని అలాంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 36 సం,,లు కష్టపడ్డ రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల స్థలం లేదంటే కంపెనీ నివాస గృహం అందచేయాలని డిమాండ్ చేశారు.విశ్రాంత ఉద్యోగుల సమస్యల గురించి యూనియన్ నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా యూనియన్ నాయకులు చొరవ తీసుకొని రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో గెలిచిన యూనియన్ కార్యాలయల ముందు ధర్నాలు ఆందోళనలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు శనిగారపు రాజేశం, దాసరి ఎల్లారం, అశోక్ రాజ మొగిలి ఈర్ల సర్జన్, నెల్లి వీరయ్య, గసిగంటి మల్లయ్య, ఎల్లయ్యలు పాల్గొన్నారు.