పెన్షన్లు పెండింగ్‌లో ఉండగానే రికవరీకి ఆదేశాలు
మండిపడుతున్న విపక్షాలు
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చి 8 నెలలు కావొస్తున్నా పింఛన్లను పెంచకపోవడంతో విపక్షాలు ప్ర భుత్వంపై మండిపడుతున్నాయి. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పింఛన్లను పెంచా లని డిమాండ్ చేస్తున్నాయి. ఒక వైపు ప్రతిపక్షాలు నుంచి వచ్చే వత్తిళ్ళను ఎదుర్కొలేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి ట్రెజరీ, అకౌంట్స్ విభాగం గత నెల 27న ఏడు వేల మంది నుంచి పెన్షన్ రికవరీ చేయాలంటూ 11 జిల్లాల డీఆర్డీవోలకు ఉత్తర్వులు జారీ చే యడం మరింత తలనొప్పి వ్యవహారంగా మారింది. రెండు నెలలుగా ఆసరా పెన్షన్లను నిలిపివేయడమే కాకుండా, రూ.4 వేల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో పెన్షన రికవరీ అంటూ నోటీసులు ఇవ్వడం ఇబ్బంది కరంగా మారింది.
పాత పెన్షన్లు ఇవ్వడానికే వెయ్యి కోట్ల మేర భారం పడుతున్నది. 4వేల పెన్షన్ ఇవ్వాలంటే రెండు వేల కోట్లు కావాలి. అందుకే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులుగా ఉన్నవారిని తొలగిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటగా సర్వీసు పెన్షన్లు అందుకుంటున్న వారి పై దృష్టి పెట్టంది. ట్రెజరీ కార్యాలయాల్లో ఆధార్ నంబర్‌తో ఎంక్వురై మొదలుపెట్టింది. జిల్లాల వారీగా డీఆర్డీవోలకు ఉత్తర్వులు జారీ చేసింది. నెలరోజుల గడువులోగా వీరిని గుర్తించి రికవరీ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల పక్షపాత వ్యాధిగ్రస్తురాలైన ఒంటరి వృద్ధ మహిళ దాసరి మల్లమ్మ సర్వీస్ పెన్షన్‌తో పాటు ఆసరా తీసుకుంటున్నదనే కారణంతో రూ.1.72 లక్షలను తిరిగి చెల్లించాలని రికవరీ నోటీ సులివ్వడం రాజకీయ వివాదానికి తెరలేపింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. 4 వేల పెన్షన్ ఇవ్వలేని సర్కార్ ఉన్న వాటిని తొలగించి రికవరీ చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం నెలవారీగా టంచన్‌గా పెన్షన్ ఇవ్వడం లేదు. ఏప్రిల్ నెలలో పింఛన్లు ఇచ్చి మే, జూన్ నెలలో పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు జూలై కూడా గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వారికి రికవరీ నిర్ణయం లబ్ధిదారులను ఆగ్రహాన్ని గురిచేస్తోంది.