calender_icon.png 24 October, 2024 | 12:47 PM

Breaking News

ఇంజినీర్లతో ముగిసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ

11-07-2024 12:54:29 AM

  1. విచారణకు హాజరైన నీటిపారుదల శాఖ ఏఈఈలు
  2. నేటి నుంచి ట్రాన్స్‌కో ఇంజినీర్ల విచారణ

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్  కమిషన్ ఎదుట బుధవారం నీటిపారుదల శాఖ ఏఈఈలు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఏఈఈలను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్ల విచారణను దాదాపుగా పూర్తి చేసినట్టు సమాచారం.

మొదటి దశలో మూడు ఆనకట్టలతో సంబంధం ఉన్న ప్రస్తుత, గత ఇంజినీర్లను కమిషన్ విచారించగా.. కమిషన్ ఆదేశాల మేరకు ఆ తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. తాజాగా మూడు పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఇంజినీర్లను కూడా కమిషన్ విచారించింది. మొదట సీఈ స్థాయి అధికారులు, తర్వాత డిప్యూటీ ఈఈ స్థాయి వరకు విచారణ మంగళవారం వరకు కొనసాగింది. పంప్‌హౌస్‌ల నిర్మాణం, డిజైన్లు, నీటి నిల్వ సామర్థ్యం, ఆనకట్టల ఎత్తు, గతంలో పంప్‌హౌస్‌లు మునిగిన సందర్భాలు, అప్పుడు తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై వారినుంచి కమిషన్ వివరాలు సేకరించింది.

వారందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల ప్రారంభం నుంచి నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టు ఇంజినీర్లను ప్రశ్నిస్తూ వచ్చింది. అందులో భాగంగా ప్రాణహిత  సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం నోటీసులు పంపించారు. కొందరు సీనియర్ ఇంజినీర్లతో కమిషన్ రెండు, మూడు రోజుల పాటు విచారణ చేపట్టింది. గురువారం నుంచి ట్రాన్స్‌కో ఇంజినీర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులను విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.