- ముస్లింలే కాదు అందరూ పాటించాలి
- ‘ప్రాఫెట్ ఫర్ ది వరల్డ్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
రాజేంద్రనగర్, సెప్టెంబర్14: మహ్మద్ ప్రవక్త చూపిన మార్గం యావత్ ప్రపంచానికే అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఆయన రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ రచించిన ‘ప్రాఫెట్ ఫర్ ది వరల్డ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రవక్త చూపిన మార్గం కేవలం ముస్లింల కోసం, రాయడానికి, చదవడానికి కాదని ప్రపంచమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
జంట జలాశయాలను పరిరక్షిస్తం..
ఈసా, మూసీ నదుల నుంచి ఎంతో మురికి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జంట జలాశయాల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో వాటి ద్వారా మహానగరానికి మంచి నీరు అందించేవారని గుర్తుచేశారు. పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరానికి మరింత అభివృద్ధి చేసేందుకు, ఆదర్శంగా మార్చేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
మంచి మార్గంలో తాము ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరితో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు సీఎం తెలియజేశారు. పదేళ్ల పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని, గతంలో రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ తదితరులు సర్కారును నడిపారన్నారు. వేదికపై ఉన్న వారితో పాటు వేదిక కింద ఉన్నవాళ్లు కూడా ఎంతో గొప్పవారని పేర్కొన్నారు.
పేదలపై మాట్లాడేది అసద్ మాత్రమే
తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ఉంటే పార్లమెంట్‌లో పేద ప్రజల గురించి మాట్లాడే నాయకుడు కేవలం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమేనని సీఎం అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కార్పొరేట్, సొంత వ్యాపారాలు చేసుకునేవారు ఎక్కువ మంది అయ్యారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మహ్మద్ ఖురేషీ, ముస్లిం మత పెద్దలు, పాల్గొన్నారు.