చం. క్షణములలోన కాలమది గంటలు రోజులు నేండ్లు పూండ్లు,
వేదనలును రోదనల్ మనను తప్పక కొల్పుచు సాగిపోవుటన్,
మనమున శాశ్వతంబయిన మార్గమునైనను కానలేక జీ
వనము నిరర్థకంబవగ బాధనుపొందుచు పోవుచుంటిమే.
ఒక చినుకూ ఒకచినుకూ పడుతూ చిరుజల్లుగా, వానగా, తుపానుగా, నీరు ఏరుగా వాగుగా సాగుచూ ఎలాగైతే సాగరాన కలిసి పోవుతు న్నదో అదే విధంగా కాలము గంటలు, రోజులు, సంవత్సరాలు, మన కళ్ళముం దే క్షణాలలో గడిచిపోవుచు న్నది. మనము పుడుతూనే ఏడుపుతో మన జీవితాన్ని ప్రారంభిస్తాం. ఎదుగుతున్నకొద్దీ ఎన్నో బాధలతో, ఏడుపులతో నిరంతరం సాగిపోతూనే ఉంటుంది కాలం. అంతే మన జీవిత కాలం గడిచిపోతుంది. మనమెందుకు పుట్టామో, మన జన్మకు పరమార్థమేమిటని ఆలో చించుకొనే సమయం ఇవ్వకుండానే గడిచిపోయే కాలం మనలను కూడా కాలగర్భంలో కలిపేస్తుంది. మరెలా? ఇలా బాధలలో జన్మపరంపరను కొనసా గించవలసిందేనా? మరే మార్గ మూ లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే మా నవుడే మహర్షిగా మహా తపస్విగా, మాననీయుడుగా, మహాత్ముడుగా తన సాధనతో పరమాత్మగా స్వస్వరూపాన్ని సాధిస్తున్నాడు.
తల్లిగర్భంలో మాయలో మనం పది మాసాలు పెరిగి, ఆ మాయనుండి బైటకు వచ్చి భూ మిపై పుట్టి, మళ్ళీ ఆ కనరాని మాయలోనే జీవి తం గడుపుతున్నందున, మాయాతీతమైనదేదో ఉంటుందనీ, అది మనకు తెలియాలని, అది తెలిస్తే మాయనుండి బయట పడగలమనీ, మాయనుండి బయట పడితే ఈ వేదనలు, దుఃఖాలు మనలను బాధింపజాలవనీ గ్రహించలేకపోతున్నాం. గడచిపోయిన కాలం ఏ విధంగా వెనుకకు రాదో అదే విధంగా మన వయసు కూడా వెనుకకు రాదు కదా.
ఒక గోదాములో ఎంతో ధాన్యం నింపుతాం. ఆ తరువాత మనం ఆ ధాన్యా న్ని వాడుతుంటాం. అలా వాడుతున్నప్పుడు ఒక్క గింజ మనము దానినుండి తీసినను తరుగునే కాని పెరగదు కదా? అలా వాడగా వాడగా ధాన్యాగారం ఖాళీయగుట నిక్కము కదా? మనం పుట్టిన మొదలు మన జీవితము కూడా అంతే. ఆయుర్దాయం అనే ధాన్యంతో నింపబడిన ధాన్యాగారం వంటిది మన శరీరం. గడచిన ఏ ఒక్క క్షణమూ వెనుకకు రాదు. కావున మనం మనకు లభించిన కాలాన్ని ధనంగా భావించి పొందికగా క్షణం కూడా వ్యర్థం కాకుండా జాగరూకతతో స్థిర చిత్తులమై వినియోగించుకో గలిగితే మన ప్రశ్నకు సమాధానం లభించుట ద్వారా జీవిత పరమార్థాన్ని గ్రహించి జన్మకు సార్థకత కలిగించుకొన సాధ్యమవుతుంది. కావున ఒక్క క్షణంకూడా మనదయిన కాలాన్ని వ్యర్థపరచరాదు. నిరర్థక జీవితం గడుపరాదని పెద్దలందురు.
చింతా రామకృష్ణారావు