ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు
చెరువుల పరిరక్షణకు అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదు
స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ముందుకురావాలి
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధించడంలేదని, హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణ కోసం అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదని తెలిపారు. చెరువులను పరిరక్షించుకోవడంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆక్రమణలకు గురైన చెరువుల వివరాలను పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని స్పష్టంచేశారు. చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.