calender_icon.png 15 January, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యం చేరిన ‘పారా’లు

06-09-2024 12:25:56 AM

25 పతకాల మార్కు దాటి ముందుకు.. 30 మార్కు చేరుకుంటారా? 

పారిస్: పారిస్ పారాలింపిక్స్ భారత పారా అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పారాలింపిక్స్‌కు ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు, మాజీ పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ.. ఈ సారి పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు తప్పకుం డా 25 పతకాలు సాధిస్తారని, 25 పతకాల మా ర్కును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. ఆయ న చెప్పినట్లే పారా అథ్లెట్లు ఇప్పటికే 25 పతకాల మార్కును చేరుకోవడం గమనార్హం.

కలిసి రాని ఎనిమిదో రోజు.. 

పారాలింపిక్స్ ఎనిమిదో రోజు భారత్‌కు అంతగా కలిసి రాలేదు. ఈ రోజు కేవలం ఒక్కటంటే ఒక్క పతకాన్ని మాత్రమే మన అథ్లెట్లు సాధించగలిగారు. పారా షూటింగ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియాకు చెందిన సిద్ధార్థ బాబు, మోనా అగర్వాల్ క్వాలిఫై కావడంలో విఫలం అయ్యారు. పారా ఆర్చరీ మిక్స్‌డ్ రికర్వ్ ఓపెన్‌లో భారత్‌కు చెందిన పూజ సింగ్ తృటిలో పతకం చేజార్చుకున్నారు. కాంస్య పతక పోరులో తృటిలో ఓడారు. స్లొవేనియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ షూటాఫ్‌కు దారి తీసింది. మహిళల పారా జూడోలో 48 కేజీల విభాగంలో పాల్గొన్న కోకిలా క్వార్టర్స్‌లో కజకిస్తాన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది.

రెపిచేజ్ రౌండ్‌లో కూడా కోకిలాకు నిరాశే ఎదురైంది. ఇక పురుషుల పారా జూడోలో కపిల్‌పర్మార్ కాంస్యపతకం నెగ్గాడు. కపిల్ సెమీస్‌లో ఓడినా కానీ కాంస్య పతక పోరులో మాత్రం గెలిచి సత్తాచాటాడు. మహిళల 100 మీటర్ల టీ12 పోటీల్లో భారత్‌కు చెందిన సిమ్రన్ ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది. కానీ ఫైనల్లో మాత్రం నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. క్యూబాకు చెందిన అథ్లెట్ డ్యురాండ్ స్వర్ణం గెలవగా, ఉక్రెయిన్ క్రీడాకారిణి బోట్రుచుక్ రజతం, జర్మనీ రన్నర్ ముయెల్లర్ కాంస్యం గెలుచుకుంది.

కాంస్యం గెలిచి జర్మనీ రన్నర్ 12.26 సెకన్లలో లక్ష్యం చేరుకోగా.. భారత క్రీడాకారిణి సిమ్రన్ 12.31 సెకన్లలో రేస్ పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 65 కేజీల పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత పారా అథ్లెట్ అశోక్ పతకం తీసుకురావడంలో విఫలం అయ్యాడు. ఒకానొక దశలో పతకం తెచ్చేలా కనిపించిన అర్జున్ తర్వాత వెనుకబడ్డాడు. ఎంత ప్రయత్నించినా కానీ పతకానికి ఆమడ దూరంలో నిలిచిపోయాడు.

ఐసీసీ ఆగస్టు నామినీలు వీరే

దుబాయ్: ఐసీసీ ప్రతి నెలా అందించే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు సంబంధించి ఆగస్టు నెల నామినీలను ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికన్ క్రికెటర్ మహారాజ్, విండీస్ బౌలర్ సీల్స్, లంక ఆల్‌రౌండ్ వెల్లలాగే అవార్డు రేసులో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో లంకకు చెందిన సమరవిక్రమ, ఐరిష్ ఆల్‌రౌండర్ ప్రెండర్ గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ లూయిస్ పోటీ పడుతున్నారు. 

29న ఏజీఎం

బెంగళూరు: సెప్టెంబర్ 29వ తేదీన బెంగళూరు నగరంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 93వ వార్షిక సదస్సు (ఏజీఎం) జరగనుంది. బోర్డు సెక్రటరీ గురించి ఈ సమావేశంలో చర్చ జరగదని సమాచారం. కొత్త క్రికెట్ అకాడమీ గురించి, 2024 వార్షిక బడ్జెట్ గురించి, అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ల నియామకం గురించి ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

కివీస్ స్టార్స్ ఆగయా.. 

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు కివీస్ క్రికెటర్లు ఇండియాలో అడుగుపెట్టారు. న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి గ్రేటర్ నోయిడా వేదికగా జరగనుంది. టిమ్ సౌథీ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

భారత్‌కు మరో స్వర్ణం డెఫ్ షూటింగ్ వరల్డ్స్

హనోవర్‌లో జరుగుతున్న డెఫ్ షూటింగ్ వరల్డ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో మహిత్ సంధు పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల పిస్టల్ కేటగిరీలో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ రజత పతకం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 15కు చేరుకుంది. సంధుకు ఇది రెండో బంగారు పతకం కాగా.. మొత్తంగా సంధు మూడు పతకాలు గెలుచుకుంది.