ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పుట్టినిల్లు. రాష్ట్రంలో జరిగిన ఉద్యమం ఏదైనా పునాది ఇక్కడి నుంచే పడింది. దేశ చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీనే ముందుండి నడిపించింది. స్వరాష్ట్ర సాధనలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఎన్నటికీ మర్చిపోలేనిది. అలాగే అన్నీ ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో జేఏసీ పాత్ర కీలకం అంటున్నారు ఉద్యమకారుడు కాంపల్లి శ్రీనివాస్.
ఓయూ కేంద్రంగా 2009లో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఏఐఎస్‌ఎఫ్ తరపున ఉద్యమంలో పాల్గొన్నా. ప్రత్యేక తెలంగాణ కోసం ఒక్క పిలుపిస్తే.. చాలు తొమ్మిది గంటల వార్తలు చూసి ఉద్యమానికి వెళ్లడం జరిగేది. ప్రతిరోజు ఆర్ట్స్ ముందు ప్రొగ్రామ్స్ జరిగేవి. ప్రతిదాంట్లో పాల్గొనేది. ఓయూ విద్యార్థిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో పర్యటించి.. విద్యార్థులను చైతన్యపరిచాం.
దాదాపు అన్నీ కార్యక్రమాలను విజయవంతం చేశాం. ఎన్నోసార్లు అరెస్టులు చేశారు.. నాపై పది కేసులు పెట్టారు. ఎన్ని నిర్బంధలు పెట్టిన ఉద్యమ ఉధృతి ఎక్కడ తగ్గకుండా చూశాం.
ఓయూ విద్యార్థుల ఆమరణ దీక్ష..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షను 2009, డిసెంబర్ 24న ప్రారంభించారు. విద్యార్థుల ఉద్యమ తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం మరోసారి డిసెంబర్ 28 నుంచి హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అలా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని కేయూ విద్యార్థులు కూడా డిసెంబర్ 28 నుంచి ఆమరణ దీక్షలు ప్రారంభించారు.
అదే విధంగా తెలంగాణలోని ఉద్యమం తారాస్థాయికి చేరింది. అయితే రోజురోజుకు యూనివర్సిటీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయని ప్రభుత్వం గ్రహించి డిసెంబర్ 28న దీక్షా శిబిరంపై పోలీసులతో దాడి చేయించింది. దీక్షలో కూర్చున్న 12 మంది విద్యార్థులను బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం సీఎంను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
దీక్ష చేస్తున్న విద్యార్థులను పోలీసులు తరలించారు.. అక్కడే దీక్షను కొనసాగించాం. ఇలా ఏడు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న ఓయూ విద్యార్థుల ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలిసిన తెలంగాణ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులను గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు. డిసెంబర్ 30న మరింతగా విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినడంలో పోరాడి తెలంగాణ సాధిద్దామని కేసీఆర్ నచ్చజెప్పడంతో వారు దీక్ష విరమించారు. కానీ రిలే దీక్షలు మాత్రం కొనసాగాయి.
తొమ్మిది యూనివర్సిటీల..
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ పరిధిలోని తొమ్మిది యూనివర్సిటీల అధ్యాపకులు సికింద్రాబాద్‌లోని టీచర్స్ హోంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఈ సంఘం కన్వీనర్‌గా ఓయూ అధ్యాపకులు భట్టు సత్యనారాయణ, కో కన్వీనర్‌గా కేయూ అధ్యాపకులు పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈ సంఘం ప్రధానంగా ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు కొనసాగించే ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది.
ఓయూ విద్యార్థి గర్జన
రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికి 2010, జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి రెండురోజుల ముందే ఓయూ జేఏసీ తమ బలాన్ని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అవసరాన్ని ప్రదర్శించడానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థి గర్జనకి పిలుపునిచ్చింది. ప్రభుత్వం, పోలీస్ బలగాలు ఎంత నిర్బంధం విధించినా, ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు తండోపతండాలుగా చేరుకొని సభను విజయవంతం చేశారు. ఓయూ విద్యార్థి గర్జన ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంతవరకు తెలంగాణ ఉద్యమం ఆగదని స్పష్టమైన సంకేతాలు పంపించాం.
ఎన్నో కార్యక్రమాలు..
ఉద్యమంలో భాగంగా జేఏసీ నేతృత్వంలో జరిగిన సహాయనిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయే పోరాటాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు, పౌర సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేశాం.
ఉద్యమ ద్రోహులకే పదవులు
తెలంగాణ వచ్చిన సంతోషమే లేకుండా పోయింది. ఉద్యమ ద్రోహులకే పదవులు దక్కడం వల్ల పదేళ్ల తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేమి లేదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబా లను గుర్తించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో జరిగిన విద్యార్థి పోరాటాలకు ఎంతో చరిత్ర ఉంది. ప్రజల కోసం జరిగిన ప్రతి పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల త్యాగాలకు గుర్తింపు, గౌరవం దక్కలేదు.
తమ చదువులను, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరం కోసం పోరాడిన విద్యార్థులకు మిగిలింది శూన్యం.
- ఉద్యమకారుడు కాంపల్లి శ్రీనివాస్