calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లు జనజాతరతో దుష్ట కాంగ్రెస్‌కు ఉప్పుపాతర

08-04-2025 12:12:36 AM

ఆర్మూర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన తలపెట్టిన వరంగల్ జనజాతర దుష్ట కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద, అభివృద్ది నిరోధక దిక్కుమాలిన పాలనకు ఉప్పుపాతర వేస్తుందని బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్  ఎం ఆర్ గార్డెన్స్ లో సోమవారం వరంగల్ లో జరిగే బి.ఆర్.ఎస్. రజతోత్సవ బహిరంగ సభను విజయ వంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రజతోత్సహం, పాతికేళ్ల సమరోత్సహంగా అభివర్ణించారు.

బి.ఆర్.ఎస్. తెలంగాణ ఆత్మగౌరవ  గొంతుకని, తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ బి.ఆర్.ఎస్. పార్టీ అని పేర్కొన్నారు. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన  మేళవింపు బీఆర్‌ఎస్ ప్రస్థానం. వరంగల్ బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటేనే తెలంగాణ ద్రోహులపై ఫైటింగ్ అని అన్నారు.  కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే, ఇక్కడి బీజేపీ నేతలు తెలంగాణ మట్టి వాసనే గిట్టని గుజరాత్ గులాంలుగా మారారు.

బి.ఆర్.ఎస్ వరంగల్ రజతోత్సవ సభ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది పలకాలని కోరారు. వరంగల్ సభకు గులాబీ సైన్యం కదం తొక్కాలి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సన్నాహక సమావేశంలో బి.ఆర్.ఎస్. ఆర్మూర్ నియోజకవర్గ  ఇంఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, కౌన్సిలర్లు చక్రు, లింబాద్రి గౌడ్, మధర్, మాజీ ఎంపీపీలు మస్త ప్రభాకర్, వాకిడి సంతోష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సుక్కి సుధాకర్, దేవేందర్, మాజీ  పీఏసీఎస్ ఛైర్మన్లు కార్తీక్ రెడ్డి, బంటు మహిపాల్, పార్టీ సీనియర్ నాయకులు నక్కల భూమేష్, వెల్మల్ రాజన్న, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.