అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
కూసుమంచి (విజయక్రాంతి): ప్రతిపక్షాలు కావాలనే గ్రామ సభలను అడ్డుకుని, పేదలను రెచ్చగొడుతున్నాయని, నిరుపేదలెవరూ అధైర్యపడొద్దని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సభలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌కార్డుల జారీ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని చెప్పారు. 1978 నుంచి నేటి వరకు గ్రామాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వెళుతున్నారని, 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డులు, ఇండ్లు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్ధితి ఉండేది కాదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రకియ అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బీంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండి హఫీజుద్ధీన్, మాదాసు ఉపేందర్, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.