calender_icon.png 22 November, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగ్గుమన్న విపక్షాలు

22-11-2024 02:40:26 AM

జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్

ప్రధాని నరేంద్రమోదీ, గౌతమ్ అదానీల మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ అభిమాన వ్యాపారవేత్తగా అదానీని అభివర్ణించింది. అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవ్వడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

అదానీ గ్రూప్ లావాదేవీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. అదానీ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై గత ఏడాది జనవరి నుంచి ఆందోళనలు చేస్తూ జేపీసీ కోసం డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో భాగంగా ప్రధాని మోదీ- గౌతమ్ అదానీల మధ్య సంబంధాల గురించి వందలాది ప్రశ్నలు లేవనెత్తినట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ ప్రశ్నలకు సమాధానం రాలేదని విమర్శించారు. ఈ విషయంలో జవాబుదారీతనం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. 

ఈసారి తప్పించుకోలేడు

అదానీపై వచ్చిన అభియోగాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తీవ్ర విమర్శలు చేశారు. అదానీ భారత పెట్టుబడిదారులకు ద్రోహం చేశారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. 2023 మార్చిలో గౌతమ్ అదానీ బంధువైన సాగర్ అదానీ కార్యాలయాల్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు సోదాలు చేసినట్టు చెప్పారు.

ఈ క్రమంలోనే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేస్తున్న ఈడీ, సెబీ, సీబీఐ దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవొచ్చేమో కానీ యూఎస్ జ్యూడీషియరీ నుంచి ఈ సారి అదానీ తప్పించుకోలేరని జోస్యం చెప్పారు. 

ఇండియాకు చెడ్డపేరు

అదానీ సంస్థ భారత్‌కు చెడ్డ పేరు తెచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. అదానీపై అమెరికాలో వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  అంతేకాకుండా అదానీపై ఉన్న పెండింగ్ అభియోగాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ సెబీ వైఫల్యంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారులు నియమ నిబంధనలు పాటించేలా ప్రభుత్వ ఏజెన్సీలు పర్యవేక్షించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా అదానీని ప్రభుత్వ ఏజెన్సీలు సమర్థించాయని ఆరోపించారు. ముఖ్యంగా అదానీపై వచ్చిన అభియోగాల్లో ఒక్కదాన్ని కూడా సెబీ రుజువు చేయలేకపోయిందని విమర్శించారు. 

కేజ్రీనే అడ్డుపడ్డారు

లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న బిలియనీర్ గౌతమ్ అదానీ ఒకానొక సమయంలో ఢిల్లీ ఇంధన రంగంలోకి కూడా ప్రవేశించేందుకు ఎంతో ప్రయత్నించిందని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. కానీ అప్పుడు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అదానీని అడ్డుకున్నారని తెలిపారు. 

కంపెనీపై కోర్టుకెళ్లండి

కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కొట్టిపారేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన భారతీయ మార్కెట్లను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అదానీ గ్రూప్ పెట్టుబడులను ఎందుకు స్వాగతించాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదానీ గ్రూప్‌పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కోర్టుకు వెళ్లి అక్కడే తేల్చుకోవాలని సూచించారు. అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంస్థకే ఉంటుంది తప్ప తమ పార్టీకి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట తిరుగుతూ న్యాయవ్యవస్థ చేయాల్సిన పని చేస్తున్నారని మండిపడ్డారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అలాగే కొవిడ్ మహమ్మారి సమయంలో అందించిన వ్యాక్సిన్‌పై కూడా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే సుప్రీం కోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని గుర్తు చేశారు.