calender_icon.png 27 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాల తీరు వికృతంగా ఉంది

27-11-2024 01:58:27 AM

  1. బ్యూరోక్రాట్లను చంపేందుకూ తెగబడ్డాయి
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  3. జాతీయ రహదారులపై సమీక్ష  

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి):  రాష్ర్టంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తుంటే  బ్యూరోక్రాట్లపై కూడా దాడులు చేసి చంపించేందుకు సైతం తెగబడుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రం లో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో  ఎన్‌హెచ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు అంశాలపై ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. జాతీయ రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు.

జాతీయ రహదారుల అలైన్‌మెంట్ రూపొందించేటప్పుడు ఎన్‌హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్లు భూసేకరణను వేగవంతం చేసేందుకు కలెక్టర్, ఆర్డీఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తేనే భూసేకరణ విజయవంతం అవుతుందన్నారు. వచ్చే వారం నుంచి పనులు జరుగుతున్న రోడ్లను పరిశీలిస్తానని, నిర్మాణ నాణ్యత, స్థితిగతులను స్వయంగా చూ స్తానని తెలిపారు.

ఎన్‌హెచ్ హైదరాబాద్ సెక్షన్ పనుల అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతోందని.. కానీ పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగా మారిందని మండిపడ్డారు. వెంటనే కాంట్రాక్టర్‌కు నోటీసులు పంపాలని ఆదేశించారు. వచ్చే వారం పనులు ప్రారంభించాలని.. లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటదని హెచ్చరించారు.  ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ పూర్తి చేస్తూ జనవరి కల్లా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని అన్నారు. దీని కోసం రూ. 7వేల కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రెటరీ, ఆర్‌ఆర్‌ఆర్ పీడీ దాసరి హరిచందన, జాతీయ ఉపరితల రవాణా శాఖ ఆర్‌ఓ కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఓ శివశంకర్, ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.