calender_icon.png 24 October, 2024 | 1:54 PM

జ్ఞాన సముపార్జనకు ‘ఆస్కారం’ కల్పించింది.. ఊరి గ్రంథాలయమే!

12-07-2024 12:05:00 AM

ప్రపంచ యవనికపై పాటల చంద్రుడిగా వెలిగేందుకు ‘ఆస్కారం’ కల్పించింది.. పుట్టి పెరిగిన ఊరిలో సముపార్జించిన జ్ఞానమే! అలా సంపాదించిన జ్ఞానాన్నంతా రంగరించి ఎన్నో కొత్త కొత్త పదాలకు జీవం పోసిన ఆ అక్షర బ్రహ్మకు ఆస్కార్ పురస్కారం దక్కిన వేళ ఆ ఊరిలో సంబురాలు అంబరమంటాయి. ఎదిగి వచ్చిన బిడ్డను చూసి పల్లె తల్లి కళ్లల్లో ఆనందం చూసిన ఆ క్షణాన ఆ తల్లి రుణం కొంతైనా తీర్చుకోవాలనుకున్నారాయన.

అదే ఆలోచనను తన ఊరి వాళ్ల ముందుంచారు. చెప్పినట్లుగానే సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. అదే భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో ఆస్కార్ పేరుతో ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ నెలకొల్పిన నూతన గ్రంథాలయం. ఈ పుస్తకాలయ ప్రారంభోత్సవం ఇటీవల అట్టహాసంగా జరిగింది.  ఈ సందర్భంగా చంద్రబోస్ గురించి, చల్లగరిగతో ఆయనకున్న అనుబంధం గురించి కొన్ని సంగతులు... 

చంద్రబోస్ పూర్తి పేరు కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ ఆయన స్వగ్రామం. తండ్రి నర్సయ్య వృత్తిరీత్యా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాగా, తల్లి మదనమ్మ వ్యవసాయ కూలీగా పనిచేసేవారు. ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా చంద్రబోస్ చిన్నవాడు. బీటెక్ చదివిన చంద్రబోస్ చిన్నప్పట్నుంచి ఇష్టమైన పాటనే నమ్ముకొని సినీరంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం గీత సాహిత్యంతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

1995లో వచ్చిన ‘తాజ్‌మహల్’ సినిమాలోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ ఆయన రాసిన మొదటి సినిమా పాట. అలా ప్రారంభమైన సినీ పాటల ప్రయాణంలో ఆయన ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ఆయన రాసిన ‘నాటు నాటు..’ పాటను ఆస్కార్  వరించింది. అప్పుడు ఆ అవార్డుతో స్వగ్రామానికి వెళ్లిన చంద్రబోస్‌కు ఘన స్వాగతం లభించింది. అప్పుడే ఆస్కార్ గ్రంథాలయం నిర్మిస్తానని ఊరివాళ్లకు మాట ఇచ్చారు చంద్రబోస్. 

గ్రంథాలయం పెట్టిన జ్ఞానభిక్షతో.. 

వందలాది సినిమాల్లో వేలాది పాటలు రాసిన చంద్రబోస్‌కు పాటపై మమకారం ఎక్కువ. అది ఇప్పటిది కాదని.. బాల్య దశ నుంచి ఏర్పడిన మక్కువేనని అంటారాయన. చిన్నప్పుడు చంద్రబోస్ సొంతూరిలో ఉండగా, వాళ్ల ఇంటి పక్కనే రెండు ఆలయాలు ఉండేవి. ఒకటి శివాలయం, మరొకటి గ్రంథాలయం. రోజూ సుప్రభాత వేళలో గుడిపై మైకులో వచ్చే పాటలు వింటూ పాటలు పాడటంపై ఇష్టం ఏర్పడిందంటారాయన. ప్రతి సోమవారం గుడిలో భజన చేస్తుంటే అందులో పాల్గొనేవాణ్ని అని చెప్తారు. శాఖా గ్రంథాలయంలో వచ్చే ప్రతి కొత్త పుస్తకాన్ని పఠించే మొదటి పాఠకుడు తానేనని చెప్తుంటారు చంద్రబోస్. రాయడంపై ఆసక్తితో తానే ఓ లిఖిత పత్రిక రాసి, గ్రంథాలయంలో వేసేవాణ్నని, ఊరిలో జరిగే సంఘటనలన్నీ వార్తల రూపంలో అందించటంతో ఊరి పెద్దలు, ప్రముఖులు తన లిఖిత పత్రికను ఆసక్తిగా చదివేవారని పలు సందర్భాల్లో చెప్పారు. 

ఇష్టమైన కవులు, రచయితలు.. 

తన ఇష్టమైన కవులు, రచయితల గురించి చంద్రబోస్‌ను అడిగితే ‘నా కన్నా ముందు పాట రాసిన ప్రతి ఒక్కరూ తనకు గురువులతో సమానమే అని చెప్తారు. ‘భక్త ప్రహ్లాద’లో ‘పరితాప భారంబు భరింప తరమా..’ అంటూ తొట్ట తొలి పాట రాసిన చందాల కేశవదాసు నుంచి తన కన్నా నెల రోజుల ముందు ‘గరం గరం పోరి’ అనే పాట రాసిన సుద్దాల అశోక్ తేజ వరకు అందరూ తనకు గురుతుల్యులేనని చెప్పే చంద్రబోస్‌లో ఓ నిగర్విని దర్శించవచ్చు. అయితే ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణమని, ఆయన్ను దైవంగా భావిస్తానంటారు చంద్రబోస్. అభిమానులు పదాల సృష్టికర్తగా పిలుచుకునే చంద్రబోస్.. ఈ విషయంలో తాను పింగళి నుంచి స్ఫూర్తి పొందానని చెప్తుంటారు. చిన్నప్పుడు ఇలయరాజా ఆల్బమ్స్ ఎక్కువగా వినేవాణ్నని, ఆయన 1995లో చేసిన ‘నథింగ్ బట్ విండ్’ అనే ఆల్బమ్‌లోని ఓ ట్యూన్ (సాహిత్యం లేకుండా రికార్డు చేసిన మ్యూజిక్ ట్రాక్)కు తాను ‘నిండెనే నా కళ్లలో.. ఆరని రూపమే...’ అంటూ రాసుకున్న పాటే తొట్టతొలిదని గుర్తు చేసుకుంటారు. 

పుస్తక నేస్తాలకో మాట... 

సాహిత్యంపై పట్టు సాధించాలనుకునేవారు బాలసాహిత్యంతో దోస్తీ చేయాలంటారు చంద్రబోస్. చిన్నప్పుడు తాను ‘చందమామ, ‘బొమ్మరిల్లు’, ‘బుజ్జాయి’, యోజన, ప్రజ్ఞ, విస్‌డమ్, చంపక్ వంటి పుస్తకాలన్నీ పూర్తిగా చేదివాణ్నని చెప్తారు. ‘బాల సాహిత్యం చదవటం వల్ల పరమ ప్రయోజనాలు ఉంటాయి. పద సంపద పెరుగుతుంది. రకరకాల శబ్దాలు తెలుస్తాయి. సొగసైన వాక్య నిర్మాణాన్ని గమనించవచ్చు. ఊహాశక్తి, కల్పనా చాతుర్యం అలవడుతుంది. కథల్లోని రుజువర్తనతో మంచి నడవడిక అలవడుతుంది’ అంటారాయన. సినిమాల ద్వారా ఎన్నో స్ఫూర్తిమంతమైన గీతాలను అందించిన చంద్రబోస్ జీవితమూ స్ఫూర్తిదాయకమే.