calender_icon.png 23 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల అభివృద్ధే ఏకైక ఎజెండా

22-01-2025 01:44:18 AM

 ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్

జగిత్యాల, జనవరి 21 (విజయ క్రాంతి): జగిత్యాల ప్రాంత సమగ్ర అభివృద్దే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 11, 12, 29, 30 వార్డుల్లో టీయూఎఫ్‌ఐడిసి  నిధులు రూ .85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భాంగా జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్’కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

జగిత్యాల పట్టణంలోని 4500 మంది పేదలకు నిర్మించిన నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీని త్వరలో జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. సదరు కాలనీలో అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరించారు. మున్సిపల్ చైర్’పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ పరిధిలోని 48 వార్డుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రేషన్ కార్డుల జాబితాలో పేరు రాలేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు మళ్లీ వార్డు ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తామని  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు బాలే లత శంకర్, నక్క జీవన్, పంబాల రాము, దుర్గయ్య, నాయకులు అబ్దుల్ ఖాదర్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.