మాస్కో, నవంబర్ 23: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఓరెష్నిక్ క్షిపణుల తయారీ పెంచాలని ఆర్మీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. అమెరికా అందించిన లాంగ్‌రేంజ్ క్షిపణులను రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉక్రెయిన్‌పైకి రష్యా కొత్త తరం ఓరెష్నిక్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది.
ఉక్రెయిన్‌పై పట్టు సాధించడానికి వీలుగా దేశంలో ఆయుధాల తయారీని పెంచాలని ఆర్మీని పుతిన్ ఆదేశించారు. హైపర్ సోనిక్ క్షిపణుల(ఓరెష్నిక్ బాలిస్టిక్ మిస్సైల్)ను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్న దేశాలపై కూడా మిస్సైల్స్‌తో దాడి చేసే హక్కు తమకుందని పుతిన్ ప్రకటించారు.
తురుపుముక్కగా ఓరెష్నిక్ మిస్సైల్..
యుద్ధం జరుగుతున్న సయమంలో రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణి క్షిపణి ఓరెష్నిక్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది. దీంతో ఇప్పుడు ప్రపంచమంతా హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన ఓరెష్నిక్‌పై చర్చ జరుగుతోంది.ఈ మిస్సైల్ తో దాడి చేయడంతో ఉక్రెయిన్‌లో భయాందోళనలు పెరిగాయి. రష్యా బార్డర్‌కు దగ్గరగా ఉన్న తమ భూభాగంలోని పట్టణాలపై వీటిని ప్రయోగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఉక్రెయిన్ భయపడుతోంది.
ఒకవేళ పశ్చిమదేశాల అండతో తమ పైకి ఉక్రెయిన్ దాడి చేస్తే వాటికి గట్టిగా సమాధానం చెప్పడానికే ఓరెష్నిక్ క్షిపణులను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. ఓరెష్నిక్ మిస్సైల్ ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉండడంతో తమ దేశంలోని అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ ఆందోళన చెందుతోంది.
దాదాపు 5 వేల కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఓరెష్నిక్ మిస్సైల్ టార్గెట్ చేసి ధ్వంసం చేయగలదు. మరోవైపు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను టార్టెట్ చేసుకుని ఒకేసారి ప్రయోగించి లక్ష్యాలను ఛేదించే వార్ హెడ్‌లను కూడా రష్యా తయారు చేసినట్లు తెలిసింది.