కొడుకు కొట్టడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వృద్ధతల్లి
మూడురోజులుగా రోడ్డుపైనే నరకయాతన
చేరదీసి ఇంటికి పంపించిన పోలీసులు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గాంధీ చౌరస్తాలో గత మూడు రోజులుగా ఓ వృద్ధురాలు అనాథలా తిరుగుతూ కనిపించడం స్థానికులను కలచివేసింది. 70 ఏండ్ల వయసున్న వడ్లకొండ కొమురవ్వ తన కొడుకు కొట్టడంతో ఇంట్లో నుంచి వచ్చి రోడ్డుపై పడి ఉంది. ఆమెకు తినడానికి తిండి లేక, చలికి వణుకుతూ నరకయాతన అనుభవిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తన కొడుకు నుంచి హింసను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. గురువారం స్థానిక కౌన్సిలర్ గూళ్ల రాజు ఆమెను గమనించి హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ మొగిలినాయక్, కానిస్టేబుల్ దూద్యానాయక్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
తనది భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లె అని, తన కొడుకు సుతారిపని చేస్తాడని, ఆయన తనను కొట్టి, తిట్టి, ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని అనడంతో ఇక్కడకు వచ్చానని ఆమె బాధపడుతూ చెప్పింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేక భయంతో ఇంటి నుంచి వచ్చానంది. దీంతో పోలీసులు తమ స్వంత డబ్బులతో ఆమె స్వగ్రామమైన బొల్లోని పల్లెకు తీసుకెళ్లి ఆమె బంధువులకు అప్పగించారు. పోలీసుల ఈ మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. కష్టంలో ఉన్న వృద్ధురాలికి సహాయం చేసిన పోలీసుల కర్తవ్య నిర్వహణను ప్రశంసిస్తున్నారు.