అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్
హుజూరాబాద్, ఆగస్టు 26: కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహేందర్ అన్నారు. సోమవారం హుజూరాబద్ పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన కుటుంబాలకు 60 శాతం పెన్షన్ ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు.
ఉద్యోగి నెలవారీ వేతనంలో 10 శాతం కోత విధిస్తూ చందాతో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాని ప్రస్తావించకపోగా, స్పష్టత ఇవ్వకపోవడం విచాకరమని అన్నారు. ఎన్‌పీఎస్ విధాన్ని ఎంచుకోవడం ఐచ్ఛికమని పేర్కొనడంలోనే అసలు మోసం దాగుందన్నారు. 1982 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ ఉద్యోగి హక్కు అని పేర్కొన్నారు. దాదాపు 30 నుంచి 40 సంవత్స రాలు పాటు ఉద్యోగి ప్రభుత్వం తరపున ప్రజా సేవకుడుగా పనిచేస్తున్నాడన్నారు. జవసత్వాలు సన్నగిల్లి ఉద్యోగి విరమణ చేసే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక భద్రతే పెన్షన్ అని, ఇది ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పును ప్రభుత్వానికి తెలియపరుస్తూ, ఒక్క రూపాయి చెల్లించకుండానే సర్వీస్‌ను బట్టి 50 శాతం ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.