calender_icon.png 17 October, 2024 | 7:25 AM

ఆ అధికారుల తీరే వేరు !

16-10-2024 02:22:11 AM

బదిలీ అయినా వారు కదలరు..

బల్దియా కమిషనర్ ఆదేశాలు బేఖాతరు 

జాయినింగ్ రిపోర్టు ఇచ్చినా పాత సెక్షన్‌లోనే విధులు 

హెల్త్ సెక్షన్‌ను వదలనంటున్న సూపరింటెండెంట్ 

టౌన్ ప్లానింగ్ వింగ్‌లో ఏసీపీల సరెండర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో కొందరు అధికారులు మరోస్థానానికి బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నా, వారు ఉన్నచోటి నుంచి కదలడం లేదు. సాక్షాత్తు కమిషనర్ అమ్రపాలీ జారీ చేసిన అంతర్గత బదిలీల ఉత్తర్వ్యులు అమలుకు నోచుకోవడం లేదు.

బల్దియాలో నెలన్నర క్రితం జరిగిన బదిలీల్లో ఎక్కడ సిబ్బంది అక్కడే విధులు నిర్వహించేలా అధికారులు పరస్పర అవగాహన కుదుర్చుకుంటున్నారు. ఓ సెక్షన్‌లో బదిలీపై వెళ్లినట్లు జాయినింగ్ రిపోర్ట్ చేసినా, కొందరు పాత స్థానాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు.

మరో సెక్షన్ తమకు నచ్చలేదంటూ ముగ్గురు ఏసీపీలను నెల తర్వాత సరెండర్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బదిలీపై వెళ్లిన మరో అధికారి సాయంత్రం కాగానే పాత సీట్లో కూర్చుని పెండింగ్ అకౌంట్లను సరిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నెల తర్వాత సరెండర్..

టౌన్ ప్లానింగ్ విభాగంలో నెల రోజులు విధులు నిర్వహించిన తర్వాత తనకు నచ్చలేదంటూ ముగ్గురు ఏసీపీలను సీసీపీ సరెండర్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ ముగ్గురు ఏసీపీలకు వేతనం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బిల్డింగ్ నిర్వహణ విభాగంలో ఖైరతాబాద్ జోన్‌కు బదిలీపై వెళ్లిన ఓ అధికారి సాయంత్రం 5 గంటల తర్వాత ప్రస్తుత అధికారి లేని సమయంలో వచ్చి..

ఆ పాత సీట్లోనే కూర్చుని బకాయి లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని అడ్మిన్ విభాగం అడిషనల్ కమిషనర్ పట్టించుకోని కారణంగానే మిగతా విభాగాల ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

కమిషనర్ అమ్రపాలి నిత్యం పాలనా సంబంధిత సమావేశాల్లో బిజీగా ఉండడం, సమీక్షలు నిర్వహిస్తుండడంలోనే బిజీగా ఉంటున్నారని, బల్దియాలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికైనా కమిషనర్ స్పందించి బల్దియా ప్రధాన కార్యాలయంలో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాయి. ఇటీవల పలు సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ విజయలక్ష్మిఈ విషయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

హెల్త్ సెక్షన్ రూటే సెపరేట్.. 

హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్‌ను యూసీడీ విభాగానికి, యూసీడీ విభాగం సూపరింటెండెంట్ హెల్త్ సెక్షన్‌కు బదిలీ అయిన్పటి,కీ ఇంకా వారు వారి స్థానాలను ఖాళీ చేయడం లేదు. వారం క్రితం యూసీడీ విభాగం నుంచి హెల్త్ సెక్షన్‌కు బదిలీ అయిన నందకిషోర్ రిపోర్ట్ చేశారు. అయినా హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రుతిని సదరు అడిషనల్ కమిషనర్ రిలీవ్ చేయలేదు.

దీంతో చేసేదేం లేక హెల్త్ సెక్షన్‌లో జాయినింగ్ రిపోర్ట్ చేసినప్పటికీ, సదరు అధికారి రిలీవ్ కానందున అప్పటికే జాయిన్ అయిన నందకిషోర్ యూసీడీలోనే పని చేయాల్సి వస్తున్నది. సదరు సెక్షన్ల ఏసీలు పరస్పర సహకారంతోనే ఈ వ్యవహారమంతా నడిపి స్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయం అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)కు తెలిసినా, ఏం తెలియనట్టు ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల నెల రోజుల పాటు సీఎంఓహెచ్ సెలవులో వెళ్లగా, ఇంచార్జిగా ఎవరినీ నియమించాలో కూడా సూచించినట్లు సమాచారం. సదరు అధికారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా, చివరకు ఆమె సూచించిన అధికారికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించడంపై  బల్దియా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

20న ప్రజా సంబురం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్ర జా సంబురం నిర్వహిస్తున్నట్టు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కులో లైవ్ మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్, ఫన్, అడ్వెంచర్స్ నిర్వహిస్తామన్నారు.

ఆర్ట్స్, పెయింటింగ్ పోటీల్లో పాల్గొనేవారు ముం దుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. చిత్రకళ పోటీలకు సంబం ధించిన థీమ్ స్పాట్‌లోనే ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు జీహె చ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయం, జూబ్లీహిల్స్ సర్కిల్ కార్యాల యంలో సంప్రదించాలన్నారు.