calender_icon.png 22 February, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణకు అడ్డుపడేది మంద కృష్ణమాదిగే

22-02-2025 12:08:47 AM

తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి 

ఖమ్మం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగజాతి గత 30 ఏళ్లుగా నిరంతర పోరాటాలతో ఉద్యమం చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, అయితే వర్గీకరణ పైన మాదిగలో తీవ్రమైనటువంటి అసహనం, అనుమానం వ్యక్తమవుతుందని, మాదిగలు చాలా నైరాశ్యంలో ఉన్నారని, దీనికి కారణం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగేనని ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రారంభం ఆయనే, నేడు అడ్డుపడేది ఆయనే అని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విడమర్తి రవి మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ పై ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి తీరుతామని ప్రకటించారన్నారు. నేడు మాలలతో కలిసి కూడా వర్గీకరణను ఆపే కుట్ర మందకృష్ణ మాదిగ చేస్తున్నాడని దుయ్యబట్టారు.

ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కృష్ణ మాదిగ కుట్ర పూరిత ఉద్యమాన్ని నమ్మొద్దని హితవు పలికారు. వచ్చే అసెంబ్లీలో వర్గీకరణను చట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

మాదిగ జేఏసీ రాష్ర్ట ఉపాధ్యక్షులు మట్టే గురుమూర్తి మాట్లాడుతూ మాదిగ జాతిని రాజ్యాధికారం వైపు నడిపించేందుకు మందకృష్ణ మాదిగ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ర్ట అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్, బహుజన నాయకులు నకరికంటి సంజీవరావు, కొరకొప్పు రామారావు, రాయల రాంబాబు, మోదుగు జోగారావు, వీరస్వామి, విజయ్, మురళి, భుజంగరావు, నాగరాజు, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.