calender_icon.png 11 February, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 13 తర్వాతే ప్రమాణ స్వీకారం!

10-02-2025 12:33:26 AM

  1. నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
  2. తిరిగొచ్చే నాటికి ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ 
  3. ఎంపికపై కసరత్తు ప్రారంభించిన అధిష్ఠానం 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశ రాజధానిలో సుదీర్ఘ కాలం తర్వాత విజయ ఢంకా మోగించిన బీజేపీ.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. సీఎంగా ఎవరి పేరును ప్రకటించాలనే విషయంపై పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. అయితే సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును ప్రకటించినా ప్రమాణ స్వీకారం మాత్రం ఈ నెల 13 తర్వాతే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 10న ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్తారు. ఈ క్రమంలోనే 12న  పర్యటన ముగించుకొని అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఈనెల 13న సమావేశమై ఇండియాకు తిరిగి రానున్నారు. ఈలోపు సీఎం అభ్యర్థిని ఖరారు చేసి, ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సీఎం రేసులో ప్రముఖులు

ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా విధులు నిర్వర్తించిన సీనియర్ నేత విజేంద్ర గుప్త కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బ్రా హ్మణ కమ్యూనిటీ నేత సతీశ్ ఉపాధ్యాయ్, ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆశిష్ సూద్ సీఎం అభ్యర్థుల జాబితాలో ఉ న్నట్టు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న జి తేంద్ర మహాజన్ ఈ రేసులో ఉన్నారు.

ఢిల్లీ సీఎంగా 52 రోజులపాటు సుష్మా స్వరాజ్  

సుమారు 27ఏళ్ల క్రితం 1993లో బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఐదేళ్ల కాలంలో పార్టీ అధిష్ఠానం అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. అప్పటి ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 49 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఢిల్లీ సింహంగా పేరున్న మదన్‌లాల్ ఖురానా తొలుత సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

అయితే అవినీతి, కుంభకోణం ఆరోపణలతో బాధ్యతలు స్వీకరించిన 27 నెలలకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈయన పదవిలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉల్లి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. కేజీ ఉల్లి సుమారు రూ.60 పలికింది.

దీంతో తీవ్ర విమర్శలు రావడంతో పదవి చేపట్టిన 31 నెలలకు సీఎం పదవికి వర్మ రాజీనామా చేశారు. ఆ తర్వాత దివంగత నేత సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి.. తదుపరి ఎన్నికల వరకు 52 రోజులపాటు విధులు నిర్వర్తించారు.