calender_icon.png 18 April, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

10-04-2025 11:40:41 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ తో కలిసి హాజరై ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, పంచాయితీ కార్యదర్శులు, మెప్మా అధికారులు, యునిసెఫ్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు అంగన్ వాడి కేంద్రాలలో కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.

మహిళ గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డకు 2 సంవత్సరాల వయసు ఉండే వరకు గడిచే దశ బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలలో కార్యక్రమాలు చేపట్టాలని, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు వారిని గుర్తించి వారికి సకాలంలో పౌష్టిక ఆహారం, అవసరమైన మందులు అందించి వారి ఆరోగ్య స్థితిగతులలో వృద్ధి తీసుకురావాలని తెలిపారు. గర్భిణులు ప్రతినెలా బరువు పరిశీలించుకోవాలని, సమయానుసారంగా అవసరమైన పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు.

పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పిల్లల బరువు, ఎత్తు, చుట్టుకొలతలు పరిశీలించి ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి సకాలంలో పౌష్టిక ఆహారం, మందులు అందించి సాధారణ స్థితికి తీసుకురావాలని తెలిపారు. ప్రాజెక్టు అధికారులు, సూపర్ వైజర్లు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తల సహకారంతో పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అంగన్వాడీల ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, మెప్మా పి. డి. మోతిరామ్, ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్ వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.