జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ప్రాపర్టీ పన్ను, త్రాగునీరు, సి.సి.చార్జీలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతీ కూలీకి పనులు కల్పించాలని అన్నారు. నర్సరీల్లో నాటిన వివిధ విత్తనాలు మొలకెత్తేలా వాటరింగ్ ప్రతీ రోజూ నిర్వహించాలని తెలిపారు. నిరుపేదలకు మంజూరు చేసిన మరుగుదొడ్లను నిర్మించాలని తెలిపారు. గ్రామాల్లో ఆస్తిపన్ను వసూళ్లు చేయాలని అన్నారు. ఇప్పటివరకు 70 శాతం వసూలు చేయడం జరిగిందని, మిగతా పెండింగ్ వచ్చే నెల 15 లోగా పూర్తిచేయాలని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో వచ్చే వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వాటర్ సోర్స్ లను ముందే ఏర్పాటు చేసుకోవాలని, అవసరం మేరకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలనీ సూచించారు. పెండింగులో ఉన్న సి.సి. చార్జీలు చెల్లింపులు చేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. గత మూడు, నాలుగు నెలల నుండి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారని తెలుపుతూ, ఇదే స్ఫూర్తితో మున్ముందు పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓలు రంగనాథ్ రావు, ప్రభాకర్, జడ్పీ సీఈవో చందర్, సి.పి.ఒ. రాజారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ దయానంద్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఎ.పి.ఒ. లు తదితరులు పాల్గొన్నారు.