హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్
ఆధునిక విద్యార్థులు, యువత ఉద్యోగం కోసం మాత్రమే చదువుతూ సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని అందించే పుస్తకాలను వదిలేస్తున్నారు. మొత్తం పుస్తకంలో రెండు వాక్యాలైనా మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి దోహదపడతాయి. ఒకసారి పుస్తకం వైపు మళ్లితే.. విషయ పరిజ్ఞానంతోపాటు ప్రపంచ విషయాలనూ అవగాహన చేసుకుంటాం. మనం కోరుకునే ఉత్తమ సమాజం ఆవిర్భావానికి మళ్లీ పుస్తకం అవసరం ఉందంటున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్‌తో ‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూ ఇది. ఆయన మాటల్లోనే..
‘పుస్తకాలు చదవకపోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యంలోనూ, నైచ్యంలోనూ మునిగిపోయే వాణ్ని’ అంటాడు మాక్సిం గోర్కీ. ‘విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం మరోటి లేదు. దానిని సమర్థవంతంగా ఉపయోగిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చు’ అంటాడు నెల్సన్ మండేలా. ‘జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి వెనుక ఖచ్చితంగా పుస్తకాల ప్రభావం ఉంటుందని’ మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నాడు.
ఎవరికైనా పుస్తకాలు చదివేలాగా ఉపాధ్యాయులో, తల్లిదండ్రులో, పరిసరాల ప్రభావమో ప్రేరేపించగలిగితే అతనికి బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి ఆయుధంగా ఉపయోగపడుతుంది. ప్రపంచాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఇవాళ చదవడం అనేది ఉద్యోగం కోసం అంటున్నాం. నిజానికి చదవడం అనేది జ్ఞానం కోసమే.
వివిధ రంగాలలో ప్రముఖులు ‘నన్ను మార్చింది మా గురువులు లేదా మా గ్రంథాలయం’ అంటారు. ‘ఫలానా పుస్తకం చదివి ప్రభావితం అయ్యా’నంటా రు. గ్రంథాలయాలను పిల్లలతో జోడించగలిగితే మంచి అవుట్‌పుట్ వస్తుంది. మన పిల్లలను మనమే పెంచుతున్నామని అనుకుంటున్నాం. కానీ, మీ ఇంట్లో ఉన్నంత సేపే మీ పిల్లాడు.
బయటకు వెళ్లగానే అనేక అంశాలకు ప్రభావితం అవుతుంటాడు. ఆ ప్రభావాలు మంచివైతే, మంచివైపు.. చెడువైతే చెడువైపు వెళ్తాడు. సమాజం పాత్రను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చగలిగితే రేపటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు, యువకులు మంచి సమాజాన్ని నిర్మించుకుంటారు.
పుస్తకాల ద్వారానే మంచి పౌర సమాజం
మాది ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్ట మాకురేవు. చిన్న ట్రైబల్ విలేజ్. 40 కుటుంబాలు. ఆ ఇళ్లల్లో చదువుకున్న వాళ్లు జీరో. సింగిల్ టీచర్ బడి. మాకు వచ్చిన సార్‌కు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. చందమామ, బాలమిత్రలు తెచ్చేవాడు. “ఇవి చదవండ్రా..” అని మాకిచ్చేవాడు. అట్లా ట్రైనప్ చేశాడు. హైస్కూల్లో కూడా సార్లు ‘మీకు నచ్చిన సూక్తులు రాసుకు రమ్మ’నేవారు. ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమని చెప్పేవారు. అట్లా చదవడం, రాయడం, మాట్లాడటానికి స్కూళ్లు రూపకల్పన చేశాయి.
హైస్కూల్ స్థాయిలోనే చందమామ పుస్తకాలు ఎప్పటి కప్పుడు చదివేసేవాణ్ని. ఇవాళ పౌరాణిక, ఇతిహాసాలు సంబంధిత విషయాలపై పట్టు ఉం దంటే స్కూల్లో నేర్చుకున్నవే. టెక్ట్స్ బుక్స్‌లోవి మాత్రమే చదివితే పరిమితమైన జ్ఞానంతో ఉంటా వు. అదనంగా చందమామ, బాలమిత్ర ఇతరత్రా సామాజిక జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు చదవడం వల్ల మంచి పౌర సమాజం తయారవుతుంది.
మనం కూడా ఉత్తమ పౌరులుగా ఎదగడానికి బీజం పడుతుంది. ఆ బీజం మాకు హైస్కూల్లోనే పడింది. 40 ఏళ్ల క్రితం.. కాలేజీలలో ఎవరి చేతిలో చూసినా సామాజిక అంశాలకు సంబంధించిన ఒక పుస్తకం కచ్చితంగా ఉండేది. పుస్తకాలు సమాజానికి అవసరం. ఈ తరాన్ని ఆ పుస్తకాలవైపు మళ్లించగలిగితే సమాజం చాలా అద్భుతంగా ఉంటది.
అధ్యయన సాధనంగా సోషల్ మీడియా
సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు వాళ్ల అభిరుచుల ప్రకారం ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది. ఈ వేదికలో సినిమాలు, రీల్స్, సెల్ఫీలు, అశ్లీలం, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ జీవితానికి సంబంధించిన ప్రొడక్టివ్ కాదు.
చదవడం, రాయడం వైపు మళ్లించడానికి విద్యాలయాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాను కూడా సాధనంగా వినియోగించాలని 2012లో మేం ‘కవి సంగమం’ పెట్టాం. గత పదేళ్లుగా కవిత్వం రాసేవాళ్లు కూడా బాగా పెరిగారు. అన్ని రంగాలలో పనిచేస్తున్న వాళ్లు కవిత్వం రాస్తున్నారు.
వారిలో గృహిణులు, మెకానిక్‌లూ ఉన్నారు. కొంతమంది కథలు రాస్తున్నారు. కొందరు నవలలు సీరియల్‌గా రాయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాను కూడా ఒక అధ్యయన పరికరంగా, సాధనంగా మల్చుకోవాలి.
గ్రంథాలయాల కేంద్రంగానే జ్ఞానం
గ్రంథాలయోద్యమం రోజుల్లో వట్టికోట ఆళ్వారుస్వామి వంటివాళ్లు పుస్తకాలను భుజాలపై వేసుకుని తిరిగేవారట. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ కృషికూడా చాలా ఉంది. ఎక్కడ గ్రంథాలయం ఉంటే అక్కడ జ్ఞానం విస్తరిస్తుంది. గ్రంథాలయాలలో కొత్త పుస్తకాలు పిల్లలకు అందుబాటులోకి తేవాలి. సభ్యత్వం పెంచుకోవాలి. పుస్తకాలపట్ల ప్రేమను ప్రకటించి, ప్రజలను చైతన్య పరిచే వాళ్లను ఉద్యోగులుగా నియమించాలి.
మా ఊర్లో ఒక ఇంట్లో 5 వేల పుస్తకాలతో లైబ్రరీ పెట్టా. అక్కడ గ్రంథాలయం ఉందంటే మా ఊరితోపాటు మిగతా గ్రామాల వాళ్లు అక్కడకు వస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లు చదువుకుంటారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూరెళ్ల విఠలాచార్య కొన్ని లక్షల పుస్తకాలతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చా రు. ఫౌండేషన్’ అనేక స్కూళ్లలో కృషి చేస్తున్నది.
తోపుడు బండి సాధిక్ జీవించినంత కాలం పుస్తకాలు, పిల్లలు ప్రపంచంగానే బతికాడు. పిల్లలు చదవడం వైపు మళ్లితే.. సానుకూల దిశలో పయనిస్తారు. తద్వారా తెలంగాణ జ్ఞానవంతంగా తయారవుతుంది. దాశరథి, వట్టికోట, డాక్టర్ సి. నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, జయశంకర్, రావెళ్ల వెంకటరామారావు ప్రభృతుల రచనలు తెలంగాణ ఉద్యమానికి బాగా ఉపయోగపడ్డాయి.
తెలంగాణ చైతన్యాన్ని రగిలించాయి. ఆ పుస్తకాల ద్వారానే ఉపన్యాసాలు వచ్చాయి. ఆ పుస్తకాలలో రికార్డు అయిన అంశాలతో ప్రజలు జాగృతమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించింది.
స్వాతంత్య్రం సాధించుకున్న 75 ఏళ్ల తర్వాత సమాజం ఒక కన్ఫ్యూజన్‌లో ఉంది. ఎలా ముందుకు పోవాలో తెలియని పరిస్థితికి నెట్టివేయబడింది. ఇప్పటిదాకా సంపద సృష్టించడం వైపు వెళ్లింది. సమాజంలో నలుగురికి ఉపయోగపడాల్సిన మనిషి జీవితం ఒక న్యూనతలోకి నెట్టివేయబడుతున్నది.
ఎదిగిన వాళ్లు ‘మేం సక్సెస్’ అంటున్నారు. ఈ పరిణామాలు మంచివి కావు. సంపాదించాలనే దృష్టి కోణాన్ని మార్చాలి. మనిషి మనిషిని గౌరవించేలా, మనిషిని మనిషిగా గుర్తించే సమాజం కావాలి. అందుకు ఒక కొత్త వ్యూను వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. దీనికి జ్ఞానాన్ని సముపార్జించిన వారి సంఖ్య పెరగాలి.
బుక్ ఫెయిర్ అంటే పుస్తకాలు అమ్మడం, కొనడం కాదు!
తల్లిదండ్రులారా! మీ పిల్లలను కచ్చితంగా బుక్ ఫెయిర్‌కు తీసుకురండి. ఆ వాతావరణంలో ఏ క్షణాన ఏ మెరుపు మెరుస్తుందో తెలీ దు. బుక్ ఫెయిర్ అంటే పుస్తకాలు అమ్మడం, కొనడం కాదు. సమాజంలో మార్పు తీసుకు రావడానికి జరిగే ప్రక్రియ. అధ్యాపకుడిగా 35 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా, విద్యార్థులపట్ల అధ్యాపకుడు దృష్టిపెడితే వాళ్లను మంచి తోవలో నడిపించవచ్చు.
విద్యార్థి దశలో పిల్లలను పుస్తకాలవైపు ఎంత మళ్లించగలిగితే స మాజం అంతగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. విద్యార్థులను, వ్యక్తులను డబ్బులతో కొలవడం మానేసి ప్రవర్తన, జ్ఞానం, విజ్ఞత, మంచితనం ఆధారంగా చూడాలి. 37వ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబరు 19 నుంచి 29 వరకూ హైదరాబాద్‌లోని ఎన్టీయార్ స్టేడియంలో జరుగు తుంది. ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ’ పూర్తి సౌజన్యాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది 300లకు పైగా స్టాల్స్ వస్తున్నాయి. వీటిలో అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయి పబ్లికేషన్లు ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ నుం చి వస్తున్నారు. పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ప్రత్యేకంగా నాకు నచ్చిన పుస్తకం, నన్ను మార్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం.. అనే అంశాలపై చర్చించేందుకు ఫోకస్ చేస్తున్నాం.
37వ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కమిటీ
ఈ ఏడాది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ గౌరవ సలహాదారులుగా రిటైర్డ్ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్, పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి, సామాజిక వేత్త ప్రొ. రమా మేల్కోటే. అధ్యక్షులుగా యాకూబ్, ఉపాధ్యక్షులుగా కె. బాల్‌రెడ్డి, బి. శోభన్‌బాబు, కార్యదర్శిగా ఆర్. వాసు, కోశాధికారిగా పి. నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎ. జనార్ధన్ గుప్తా, జి. విజయరావు, ఎన్. మధుకర్, ఎన్. కోటేశ్వరరావు, ఆర్. శ్రీకాంత్, యు. శ్రీనివాసరావు, టి. సాంబశివరావు, స్వరాజ్ కుమార్‌లు ఉన్నారు.
- వంగూరి గోపాలరావు
‘విజయక్రాంతి’, సిటీబ్యూరో