స్మార్ట్ కారాగారాలు.. ఈక్షి ప్లాట్‌ఫాం
58 మంది ఖైదీలకు రూ.22,46,000 రుణాలు
2650 మందికి నైపుణ్యాభివృద్ధి
వార్షిక ప్రెస్ మీట్‌లో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్ర
మలక్‌పేట: జైల్‌లో శిక్షను అనుభవించి తిరిగి బయటికి వెళ్లే ఖైదీలకు జీవనోపాధికి ఉపయోగపడే విధంగా నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్ర అన్నారు. గత ఏడాది 2650 మంది ఖైదీలకు వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో జైల్‌లోనే శిక్షణ కల్పించినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా జైల్‌లో శిక్షా కాలాన్ని అనుభవిస్తున్న ఖైదీలకు వారి పిల్లల ఉన్నత చదువులు, కుమార్తెల పెళ్లిళ్లకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు ఆమె వివరించారు. మూడు సంవత్సరాల శిక్ష తర్వాత ఖైదీలు ఈ అవకాశానికి అర్హులని ఆమె పేర్కొన్నారు. బుధవారం చంచల్‌గూడ జైల్ ప్రాంగణంలో సీకా లో ఏర్పాటు చేసిన వార్షిక ప్రెస్ మీట్ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు 552 మంది ఖాదీలకు రూ.1,73,08,500 వరకు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. గత ఏడాది 2024లో 58 మంది ఖైదీలకు రూ.22,46,000 రుణాలు మంజూరయ్యాన్నారు. వీటిని ఖైదీలు సంపాదించిన వేతనాల నుంచి రికవరి చేస్తున్నట్లు తెలియజేశారు. జైల్ సూపరింటెండెంట్‌లు, ఇన్‌చార్జీలు ప్రత్యేక శ్రద్ద తీసుకుని జైల్ అదాలత్‌లను నిర్వహించడం జరిగిందన్నారు. దీని ద్వారా గతేడాది లో 1932 కేసులు ఉండగా, వీరిలో 483 మంది ఖైదీలు విడుదల్యయారని తెలిపారు.
పెరిగిన ఖైదీల సంఖ్య...
రాష్ట్రంలోని జైల్‌లకు వచ్చే ఖైదీల సంఖ్య పెరిగిందని డీజీ సౌమ్య మిశ్ర తెలిపారు. 2023లో 29,059 పురుషులు, 2,332 మంది మహిళలు, 37 మంది ట్రాన్స్‌జెండర్లు మొత్తం 31,428 మంది ఖైదీలు వివిధ కేసుల్లో జైల్‌కు వచ్చారన్నారు. అదే 2024లో 38,239 పురుషులు, 2,875 మహిళలు, 24 ట్రాన్స్‌జెండర్లు మొత్తం 41,138 మంది చేరినట్లు తెలిపారు. వీరిలో డ్రగ్స్ కేసులో(ఎన్‌డిపిఎస్) పట్టుబడి జైల్‌కు వచ్చిన వారి సంఖ్య 2023లో 3,688 ఉండగా, 2024లో 6,311 ఉన్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్ కారణంగా నేరగాల అరెస్టు సంఖ్య పెరిగి ఉండవచ్చన్నారు.
జైళ్ల ఆధునీకరణ...
జైళ్లలో అన్ని ఆధునిక హంగులతో ఆధునీకరిస్తున్నట్లు డీజీ సౌమ్య మిశ్ర తెలిపారు. ఎంఓఎఫ్ ఫండ్స్ ద్వారా ఎక్స్‌రే బ్యాగేజ్ స్క్యానర్లు, 105 వాకీ టాకీలు, 123 సీసీటీవీ కెమెరాలు, 20 శరీరం పై ధరించిన కెమెరాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేంద్ర కారాగారాలు, జిల్లా జైలులో కంట్రోల్ రూం లను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. స్మార్ట్ కియోస్క్‌ల ద్వారా సమాచార సేవలు, కోర్టు తేదీలు, పెరోల్ సమాచారం, క్యాంటీన్ కూప్‌లను తదితర వాటిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఆక్షి ద్వారా ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
జైళ్ల పరిశమల స్థాపన...
చంచల్‌గూడ కేంద్రకారాగారము, సంగారెడ్డి కేంద్ర కారాగారాములు పీపీపీ మోడల్ ద్వారా 2024లో 2 స్టీల్ పరిశ్రమలను స్థాపించినట్లు డీజీపీ సౌమ్య మిశ్ర తెలిపారు. ఇది వరకే కార్పెంటరీ యూనిట్లు, సబ్బు యూనిట్లు, డ్యూరీస్, కార్పెట్ యూనిట్‌లు, డైయింగ్ యూనిట్లు, వీవింగ్, టైలరింగ్ యూనిట్లు, ప్రింటింగ్ ప్రెస్, బేకరీ యూనిట్, పౌల్ట్రీ ఉత్పత్తుల సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా ఖైదీలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని తమ జీవనోపాధిని సంపాదించుకోవచ్చునని, వారు విడుదలైన తర్వాత సమాజంలో ఉపయోగపడుతుందన్నారు. జైళ్ల ఉత్పత్తులను మై నేషన్ ఔట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంతో 29 ఇంధన ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 86 సెమీ ఓపెన్ ఖైదీలు, 197 విడుదలైన ఖైదీలు నిర్వహిస్నున్నట్లు తెలిపారు. 2024లో చంచల్‌గూడ కేంద్ర కారాగారము, ఆదిలాబాద్ జిల్లా జైల్, హుజురాబాద్, సూర్యాపేట సబ్ ల వద్ద కొత్తగా 4 ఔట్‌లెట్‌లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2024లో నుమాయిష్‌లో ప్రభుత్వ రంగం నుంచి ఉత్తమ ప్రదర్శన స్టాల్ బహుమతి లభించిందన్నారు. భవిష్యత్తులో పేపర్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా తయారు చేయడం, వృధా చేసిన ఆహారం, వంట గది వ్యర్థాలను కంపోస్ట్‌గా చేయడానికి, దేవునికి ఉపయోగించే పువ్వుల నుంచి సువాస అగర్‌బత్తీలను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలియజేశారు. రా3ష్టంలో నాలుగు డీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యోచిన్నట్లు తెలిపారు. సమావేశంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.