- వరద ప్రవాహానికి అడ్డుగా మట్టి దిబ్బలు
- వరద వెళ్లేందుకు దారిలేకే ఆడిట్ టన్నెల్‌లోకి నీరు
- మెయిన్ కెనాల్ గుండా సర్జ్‌పూల్, పంపుల్లోకి..
- పరిస్థితి అంచనాలో అధికారులు విఫలం
- పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి
- అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు, కాంటాక్టర్ల స్వయంకృతాపరాదం వల్లే మూడో లిఫ్టు వట్టెం వద్ద బాహుబలి మోటర్లు వరదలో మునిగినట్టు తేటతెల్లమవుతోంది. ప్యాకేజీ శ్రీపురం ఆడిట్ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి తవ్విన మట్టి ని సరైన విధానంలో వేయకపోవడం వల్లే ఈ వర్షాల కారణంగా వచ్చిన వరద సొరంగంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.
తుడు కుర్తి గ్రామ సత్యసముద్రం చెరువు అలుగు నుంచి నాగనూలు గ్రామ చెరువులోకి వెళ్లే వరద ప్రవాహానికి అడ్డుగా సొరంగంలోని మట్టిని పొసుకున్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్టుగా జిల్లాలో సుమా రు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో తూడుకుర్తి సత్యసముద్రం చెరువు నుంచి సుమారు 5 వేల క్యూసెక్యుల నీరు నాగనూలు నాగసముద్రంలోకి వెళ్లలేక ఆడిట్ టన్నెల్ వద్ద గండిపడి మెయిన్ టన్నెల్‌లొకి వరద చేరింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదాన్ని సోమవారం ‘విజయక్రాంతి’ దిన పత్రిక వెలుగులోకి తీసుకువచ్చి అధికారులను అప్రమత్తం చేసింది. అయినా, మంగళ వారం ఉదయం మెల్లిగా మేల్కొవడంతో అప్పటికే బాహుబలి మోటర్లు వరదనీటిలో తేలుతూ దర్షనమిచ్చాయి.
భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి అవకాశం
రెండో లిఫ్టు శ్రీవీరాంజనేయ ఏదుల నుంచి వనపల్లి జిల్లా శానాయిపల్లి వద్ద, నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం, ఉయ్యాలవాడ ప్రాంతంలో ఆడిట్ టన్నెల్స్ ఉన్నా యి. వాటి నుంచి వట్టెం వెంకటాద్రి పంప్‌హౌస్ వరకూ అండర్ గ్రౌండ్ టన్నెల్ పను లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 34 కిలోమీటర్లు పూర్తికాగా కేవలం సగం మాత్రమే లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ శ్రీపురం ఆడిట్ టన్నెల్ గుండా మెయిన్ టన్నెల్‌కు వరద ప్రవహించడంతో ఉయ్యాలవాడ వద్ద ఉన్న ఆడిట్ టన్నెల్‌తోపాటు శానాయిపల్లి ఆడిట్ టన్నెల్ వరకూ వరద ప్రవహించే ఆస్కారం ఉన్నదని అంచనా వేస్తున్నారు. దీంతో సుమారు 30 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల్లో వరద నిండుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వరద నీటిలో భారీ వాహనాలు, ఇతర విలువైన సామగ్రితోపాటు సిబ్బంది కూడా ఉండే ఆస్కారం ఉందని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో పక్క విద్యుత్ వైర్లు కూడా వరద నీటిలో మునగడంతో విద్యుత్ ప్రమా దం కూడా జరిగి ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. దీంతో విలువైన బాహుబలి మోటర్లతోపాటు విలువైన సామగ్రి, ఇతర వాహనాలతో పాటు కార్మికులు కూడా చిక్కుకునే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొత్తంగా వరదనీటిని పూర్తిగా బయటికి తోడితేనే నష్టం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు.
వీలైనంత త్వరంగా పునరుద్ధరణ : మంత్రి జూపల్లి
ముంపునకు గురైన పాలమూరు మూడో లిఫ్టును పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం కుమ్మెర వద్ద ఉన్న వట్టెం పంపులను అధికారులతో పాటు పరిశీలించారు. వరదనీటిని ఎత్తిపోసి వెంటనే మోటర్లను సిద్ధం చేయాలని సూచించారు. అంతకు ముందు ఏదుల పంపుహౌస్, ప్రాజెక్టును పరిశీలించారు.
ఆడిట్ టర్నెల్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ
ఆడిట్ టన్నెల్ వద్ద బుధవారం ఈఎన్‌సీ అనిల్ కుమార్, ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ రెడ్డి పరిశీలిం చారు. వరద ప్రవాహాన్ని అడ్డుకునేలా రక్షణ చర్యలు, ఇతర అంశాలను తెలుసుకున్నారు.
నిర్లక్ష్యమే నిండా ముంచింది
కరువు ప్రాంతానికి వరప్రదాయిని అయిన పాలమూరు ప్రాజె క్టును 5 లిఫ్టులుగా విభజిస్తూ శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తూ 7లక్షల ఎకరాలకు నీరందించేలా రూపొందించారు. కాగా, రెండో లిఫ్టు ఏదుల లోని శ్రీవీరాంజనేయ రిజర్వాయర్ నుంచి టన్నెల్ ద్వారా వట్టెం వెంకటాద్రి మూడో లిఫ్టు వరకు టన్నెల్ ద్వారా నీటిని అందించేలా రూపకల్పన చేశారు. కాగా, టన్నెల్ పను లను మేఘా, హెచ్‌సీఎల్ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి.
కానీ, అండర్ గౌండ్ టన్నెల్ ప్యాకేజీ అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ గొలుసుకట్టు చెరువుల వరద నీటి ప్రవాహం ప్రదే శంలోనే టర్నెల్ నుంచి తీసిన మట్టిని స్టోర్ చేశారు. దీంతో చిన్నపాటి కుంటగా మారడంతోపాటు ఆడిట్ టన్నెల్ ప్రహరీకి రక్షణ గోడను ఏర్పాటు చేసుకోలేకపోవడంతో అధిక వర్షపాతం వల్ల అధికారుల డొల్లతనం బయటపడింది. ఆడిట్ టన్నెల్ ద్వారా వరదనీరు చేరుతున్న విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో అధికారులు ఉండటం.. ‘విజయక్రాంతి’ ముందే మేల్కొల్పినా ఆలస్యంగా స్పందించడం వల్లే అధిక నష్టం వాటిల్లినట్టు తీవ్ర విమర్షలు వ్యక్తం అవుతున్నాయి.