calender_icon.png 4 October, 2024 | 8:49 PM

ఆత్మసాక్షాత్కారం తర్వాతి స్థితి జీవన్ముక్తి

04-10-2024 12:00:00 AM

ఉపనిషత్ సుధ :

“నచికేతా! ఆత్మసాక్షాత్కారం కలిగిన అనంతరం మిగలేది చిర, సుస్థిర, సంస్థిత శాంతి. దాని నుండీ ఆనందం, ఆ ఆనందం నుండి ప్రేమ. ఒక దాని వెంట ఒకటి లభించి అనుభూతిగా రూపు దిద్దుకుంటుంది. ఇంతవరకు దేనికోసమై ఇంతగా సాధన జరిగిందో అది లభించి, లభించిన దానికీ, అన్వేషకుడికీ భేదమే లేని స్థితి స్థిరమవుతుంది.

ప్రశ్నలు మలగి పరమశాంతి వెలిగి మనుష్య మనీషాది అనేక ఆనంద స్థితులను దాటి బ్రహ్మానందం నిశ్చల కాసారం వలె, అనుభవమవుతుంది. అటువంటి నిశ్చల, నిర్మల హృదయమే ‘నేను’ను కాంతిగా స్ఫురింపచేస్తుంది.

ఆ కాంతి గాఢము, విస్తృతము అవుతున్న కొద్దీ దైవీ సంపద ప్రేమగా రూపు దాల్చి, ’అంతా అదే’ అన్న భావన నిలకడ చెందు తుంది.

సూర్యచంద్రాదులు, గ్రహతారకలు... ఒకటే మిటి సర్వమూ తేజోమయంగా అను భవ మవుతుంది.

దేహంలో ఇంద్రియాలు, మన సు, బుద్ధి అన్నీ సమన్వయం తో నియంత్రితమైన స్థాయిలో తమ తమ కార్యకలాపాలను నిర్దు ష్టం గా కొనసాగిస్తూనే ఉంటయ్. మ ల, విక్షేప, ఆవరణ వంటి దోషాలు బహు దూరంగా జరిగిపోయి, ఆత్మక్షేత్రం ప్ర శాంత, ప్రసన్న కాంతితో విరాజమానమవు తుంది. నచికేతా! ఈ సందర్భంలో క్షేత్రజ్ఞుడు ఆత్మజ్ఞుడౌతాడు.

యోగం సహజ స్థితిగా దివ్యానుభవం కలుగుతుంది. ధ్యానం సహజ ప్రక్రియగా మారుతుంది. చిత్తవృత్తులు నశించి, నిశ్చల దీపం వలే ఆత్మానుభవం స్థిరమవుతుంది.

ఇంతటి సాధనను నీవంటి జిజ్ఞాసి ఒక జన్మలోనే పూర్తి చేసుకుని ముక్తుడు కాగలడు.

ప్రవృత్తి, నివృత్తులను దాటిన సంపూర్ణ చేతనా స్థితి ఇదే. జనన మరణాలు దేహంలోనే ఇమిడి ఉన్నయ్. కనుక, ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మవిదుడు, అన్నిటికీ అతీతుడై తనలోని దివ్యత్వాన్ని, సహజస్థితిలో స్వాత్మానంద స్థితిలో అనుభవిస్తూ, అభేద స్థితిలో ఉంటాడు.

నచికేతా! నీ బొటన వేలు ఎంత ఉన్నదో, ఆ పరిమాణంలో నీ హృదయం అనే గుహలో ‘నేను నేను’ అంటూ శబ్దబ్రహ్మంగా, జ్యోతిర్మయంగా, అఖండంగా, అనాహతంగా నినదిస్తున్న, ప్రకాశిస్తున్న ఆత్మ నిజానికి నీవే! నీ ఆత్మ ప్రజ్ఞతో ఈ ‘ఎరుక’ను సాధించు! ‘నీ’ అంటే మనుష్య జన్మ పొందిన నీ వంటి వారందరూ సాధించుకోవలసిన స్థితి ఇదే.

ఆత్మవిద్యను, యోగప్రక్రియను నీకు సంపూర్ణంగా బోధించాను. ఈ ఆధ్యాత్మిక శక్తితో మృత్యుభయం నుండి నీ మనసు దూరమై నీవు అమరుడవు కాగలవు. ఆత్మ, బ్రహ్మం వలెనే నీవు వాటికంటే భిన్నుడవు కాదు. అంతా నీవే! అన్నీ నీవే!” మంగళాశాసనం చేశాడు, సమవర్తి!

నచికేతసుడు పరమ తృప్తిని అనుభవిస్తూ,

“ప్రభూ! ఐహిక వాంఛలను దూరం చేసుకుని, నీ వంటి సర్వోన్నతుడైన గురువు ద్వారా గ్రహించిన ఈ మహత్తర సాధనా భూమికలను మానవు లు ఆశ్రయించాలన్న నీ ఆశీర్వ చనం సర్వజన శ్రేయోదాయ కం కావాలని ప్రార్థిస్తున్నాను. అనుగ్రహించు. నీవన్నట్లు, మనుష్య జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికీ నీ దయను చెందించు.

మానవ జన్మ సమస్తం మమత, మానవత, స్వేచ్ఛ, శుభేచ్ఛ, ప్రేమ, సేవల కదంబమై శాంతి మయ, ఆనందమయ, ఆధ్యాత్మిక విద్యా విశా రదత్వాన్ని సాధించుకుని, మరణభయాన్ని తొలగించుకుని, దివ్యాత్మ స్వరూపుడై, ప్రేమా త్మ స్వరూపుడై సంచరించగలదన్న నీ అభ యమే మాకు రక్ష. అదే సుగతి. అదే సద్గతి... ” నచికేతసుడు మృత్యు దేవతకు ప్రణమిల్లాడు. గుర్వనుగ్రహంతో, స్వీయ సాధనతో నచికేత సుడు జీవన్ముక్తుడైనాడు.

- వి.యస్.ఆర్.మూర్తి