calender_icon.png 19 April, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

17-04-2025 01:47:51 AM

  1. భారత ప్రభుత్వానికి కొలీజయం సిఫార్సు
  2. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ
  3. మరుసటి రోజే గవాయ్ ప్రమాణ స్వీకారం చేసేఅవకాశం
  4. అంబేద్కర్‌వాదిగా, న్యాయకోవిదుడిగా గవాయ్‌కి గుర్తింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ(బీఆర్) గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్‌ఖన్నా వచ్చే నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ మ రుసటి రోజే జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

కొలీజియం ఇప్పటికే సీజేఐగా ఆయన పేరు ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సీనియారిటీ జాబితాలోనూ బీఆర్ గవాయ్ పేరు ముందుండడంతో సీజేఐ జస్టిస్ సంజీవ్‌ఖన్నా సైతం గవాయ్ పేరునే ప్రతిపాదించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఆరు నెలలు మాత్రమే  పదవిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తర్వాత వయోపరిమితి దృష్ట్యా ఈ ఏడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక గవాయ్ షెడ్యూల్ కులాల (ఎస్సీ) నుంచి ఆ బాధ్యతలు చేపట్టిన రెండో జస్టిస్‌గా నిలువనున్నారు. గవాయ్‌కి ముందు 2010లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.

అంబేద్కర్ స్ఫూర్తితో..

బీఆర్ గవాయ్ 24 నవంబర్ 1960న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. తండ్రి  రామకృష్ణ సూర్యభాన్ (ఆర్‌ఎస్) గవాయ్, తల్లి కమల. వీరికి ముగ్గురు సంతానం. ఒకరు  రాజేంద్ర గవాయ్. మరొకరు బీఆర్ గవాయ్. ఆయన సోదరుడు. సోదరి కీర్తి. రాజేంద్ర గవాయ్ సైతం రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. వారి కుటుంబంపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ప్రభావం ఉంది.

అంబేడ్కర్ స్ఫూర్తితో ఇప్పటికీ ఆ కుటుంబం ఇప్పటికీ బౌద్ధధర్మాన్ని అనుసరిస్తున్నది. అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకున్న గవాయ్‌కి విద్యార్థి దశ నుంచే న్యాయవ్యవస్థలో పనిచేయాలనే ఆకాంక్ష ఉండేది. 1985లో గవాయ్ న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి వర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయసేవలు అందించారు.

1992లో నాగపూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, ఆ తర్వాత అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. 2002లో అదే బెంచ్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విశిష్ట సేవలందించారు. 14 నవంబర్ 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో ఇదే కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  తర్వాత ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

తండ్రి ప్రభావం..

జస్టిస్ బీఆర్ గవాయ్‌పై తండ్రి ఆర్‌ఎస్ గవాయ్ ప్రభావం ఎంతో ఉంది. ఆర్‌ఎస్ గవాయ్ మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన దార్శనికుల్లో ఒకరు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. రాష్ట్ర రాజకీయాల్లో అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీఆర్ అంబేద్కర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. కార్యకర్తలు ఆర్‌ఎస్ గవాయ్‌ని ‘దాదాసాహెబ్’ అని పిలుచుకునేవారు.

బీఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆయన కీలక నేతగా పనిచేశారు. అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)ని స్థాపించారు. పార్లమెంట్ పరిధిలోని ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించారు.

బీహార్, సిక్కీం, కేరళ గవర్నర్‌గా సేవలందించారు. మహరాష్ట్ర శాసనమండలికి మూడు దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించారు. మండలి చైర్మన్‌గా, డిప్యూటీ చైర్మన్‌గా, కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా సేవలందించారు. ఆర్‌ఎస్ గవాయ్ 86 ఏళ్ల వయస్సులో 25 జూలై 2015న కన్నుమూశారు.

బీఆర్ గవాయ్ కీలక తీర్పులు..

* సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ అనేక మైలురాళ్లుగా నిలిచే తీర్పులిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ఒకరు. 

* 2016లో రూ.వెయ్యి, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి 4:1 మెజార్టీతో ఆమోద ముద్ర వేసిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు అమలులోకి వచ్చిన ఆరేళ్ల తర్వాత ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని, అన్యాయమని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

దీనిపై జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణియన్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించింది. జస్టిస్ నాగరత్న మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించగా, ధర్మాసనంలోని మిగతా నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. దీంతో 4:1 తేడాతో బెంచ్ ఆ తీర్పుకు ఓకే చెప్పింది.  

* రాజకీయ పార్టీలు తమ పార్టీ అవసరాలకు నిధులు సమకూర్చుకునేందుకు ఎన్నికల బాండ్ల వినియోగాన్ని రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ఒకరు. 

* తాజాగా ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సమర్థించిన ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ ఒకరు. ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజికంగా, రాజకీయంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందనేది జస్టిస్ గవాయ్ ఆకాంక్ష.