calender_icon.png 11 January, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రెవెన్యూ చట్టం భూసంస్కరణలకు దిక్సూచి

05-08-2024 12:59:28 AM

  1. రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణుల అభిప్రాయం
  2. ముసాయిదాపై చర్చించిన తర్వాత అభినందనలు
  3. మార్పుల తర్వాత వెంటనే అమల్లోకి తేవాలని సూచన

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తీసుకురాబోతున్న ఆర్‌ఓఆర్ చట్టం దేశంలోని భూసంస్కరణలకు దిక్సూచిగా నిలుస్తుందని పలువురు రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. నూతన రెవె న్యూ చట్టం కోసం రూపొందించిన ముసాయిదాపై చర్చించిన అనంతరం ఇది రైతులకు చుట్టంగా ఉందన్నారు.

డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రాష్ర్టంలోని డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతో చర్చా కార్యక్రమం జరిగింది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు వీ లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా భూచట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్, ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీరెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారు లు రవీంద్రబాబు, బాలరాజు, డిప్యూటీ కలెక్టర్లు కే రామకృష్ణ, రమేశ్ లొలేవార్ పాల్గొని మాట్లాడారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయం కోరడం చరిత్రాత్మకం అన్నారు. ఈ ముసాయిదాలోని సెక్షన్లు సక్రమంగా అమలు జరిగితే రైతులకు రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ కూడా బలోపే తం అవుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టానికి నాంది పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్‌కు సీనియర్ రెవెన్యూ అధికారులు అభినందనలు తెలిపారు. 

రెవెన్యూ వ్యవస్థ బలోపేతం: లచ్చిరెడ్డి

రాష్ర్టంలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీంతో రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని ఆరోపించారు. రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు, క్షేత్రస్థాయిలో భూపరిపాలన వ్యవస్థలను బలోపేతం చేస్తూ భూసమస్యల పరష్కారానికి కొత్త చట్టం దోహదపడుతుందన్నారు. ప్రజల నుంచే చట్టం రావాలనే ఉద్దేశంతో ఈ ముసాయిదాను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో పెట్టిందన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా చట్ట రూపకల్పనలో నిపుణులకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూల్స్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు. ఈ కొత్త చట్టంతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు అందడంతో పాటు సమస్యలను కూడా అక్కడే పరిష్కరించునే విధానం రాబోతుందన్నారు. 

రైతులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు: జీబీరెడ్డి

ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్వోఆర్ చట్టం తో ఏ చిన్న రెవెన్యూ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉందని జీబీరెడ్డి పేర్కొన్నారు. ఇది సాధారణ రైతులకు సాధ్యం కాదన్నారు. అప్పీల్, రివిజన్ చేసే మెకానిజం లేదని, కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ప్రజలకు, రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని చట్టంగా అందుబాటులోకి తెస్తే రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరుతాయన్నారు. ఈ ముసాయిదాను వెంటనే చట్టంగా చేసి అమల్లోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

రాజ్యాంగ స్ఫూర్తితో: భూమి సునీల్‌కుమార్

అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా రాజ్యాంగం రూపకల్పన జరిగిన విధంగానే కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించారని భూమి సునీల్‌కుమార్ అన్నారు. ఈ చట్టంలో కూడా దేశంలోని 18 రాష్ట్రాలలో ఉన్న చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి అందులో ఉన్న మంచిని తీసుకున్నామన్నారు. ఇప్పటికే 1936, 1948,1971, 2020లలో నాలుగు సార్లు ఆర్వోఆర్ చట్టాలు వచ్చాయని, ఇప్పడు రాబోయే ఐదో చట్టానికి మాత్రం ప్రత్యేకత ఉందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీని రూపకల్పన జరిగిందన్నారు.

స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు దక్కుతాయన్నారు. వీటి కేంద్రంగానే కొత్త చట్టం ఉండబోతుందన్నారు.  వ్యవసాయ భూములకు ఏ విధంగానైతే భూమి హక్కుల రికార్డు ఉంటుందో.. వ్యవసాయేతర భూములకు (అబాదీ భూములకు/గ్రామకంఠాలకు) కూడా భూమి రికార్డు రాబోతుందన్నారు. కొత్త చట్టంపై విమర్శలు చేయడం మాని సలహాలు, సూచనలు చేయాలని ఆయన సూచించారు.