calender_icon.png 25 October, 2024 | 1:02 AM

కొత్త డీజీపీ జితేందర్

11-07-2024 01:23:07 AM

1992బ్యాచ్ అధికారికి పోలీస్ బాస్ పదవి 

  1. డీజీపీ రవిగుప్తా హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ
  2. 14 నెలలు పదవిలో ఉండనున్న జితేందర్
  3. 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ
  4. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డీజీపీ

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కావడం విశేషం. ఇప్పటివరకు జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ఫిరోజ్‌పూర్ నుంచి తెలంగాణ డీజీపీగా..

పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో ఉన్న ఫిరోజ్‌పూర్‌లో సాధారణ రైతు కుటుంబంలో 1965లో జితేందర్ జన్మించారు. ఈయన 1992 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. జేఎన్టీయూ హైదరాబాద్, మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి పీహెచ్‌డీ చేశారు. నిర్మల్ ఏఎస్పీగా మొదట విధుల్లో చేరిన జితేందర్.. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ చేశారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో, అనంతరం 2004 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు.

డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి ఆయన, తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన నూతన డీజీపీగా బుధవారం నాడు నియమితులయ్యారు. ఆయన 2025 సెప్టెంబర్‌లో పదవీవిరమణ చేయనున్నారు. జితేందర్ 14 నెలలపాటు డీజీపీ పదవిలో కొనసాగుతారు. 

అంజనీకుమార్‌పై వేటుతో..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డీజీపీగా ఉన్న అంజనీకుమార్.. అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే నా టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలువటం పై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎన్నికల కమిషన్ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక డీజీపీగా రవిగుప్తాను నియమించింది. ఆ తర్వాత రేవంత్ సర్కారు రవిగుప్తాను డీజీపీగా కొనసాగించింది. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి ఇటీ వల జితేందర్‌వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. 

సీఎం కలిసిన కొత్త డీజీపీ

రాష్ట్ర పోలీస్ బాస్‌గా నియామకమైన తర్వాత డీజీపీ జీతేందర్ బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త డీజీపీకి పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికా రులు అభినందనలు తెలిపారు. 

15 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్, జూలై 10 (విజయ క్రాంతి): రాష్ర్టంలో కొత్త డీజీపీ నియామకం అయిన రోజే భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 15 మంది ఐపీఎస్‌లను బదిలీచేస్తూ సర్కారు బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి బదిలీ అయ్యారు.

శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్

హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీ స్వాతి లక్రా

గ్రేహౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర

పోలీస్ పర్సనల్ అదనపు డీజీ విజయ్ కుమార్

పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీ విజయ్‌కుమార్ (అదనపు బాధ్యతలు)

టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి

మల్టీజోన్ 1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీ కె. రమేష్ నాయుడు

మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

వనపర్తి ఎస్పీ ఆర్. గిరిధర్

హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ బి. బాలస్వామి

హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ జి. చంద్రమోహన్

సీఏఆర్‌హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితమూర్తి