calender_icon.png 26 March, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని నీళ్ల దందా!

24-03-2025 01:01:48 AM

 రాజేంద్రనగర్, మార్చి 23 (విజయ క్రాంతి): అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా దర్జాగా దందా కొనసాగించడం గమనార్హం. గండిపేట మండలం, నార్సింగి మున్సిపల్ పరిధిలోని వట్టినాగులపల్లి లో నీళ్లదందా   మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.

ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయక్రాంతి పత్రికలో ’నీళ్లను తోడేస్తుండ్రు’ అనే శీర్షికతో సమగ్ర వివరాలతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వట్టినాగులపల్లిలో దాడులు నిర్వహించారు. సుమారు 20 బోర్లను సీజ్ చేశారు.

వాల్టా చట్టానికి తోట్లు పొడిస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉండగా అక్రమార్కులు వట్టినాగులపల్లి లోని ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన నీళ్ల సంపులు ఏర్పాటు చేసుకొని తిరిగి తమ దందాను కొనసాగించడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా బోర్ల నుంచి నీళ్లను తోడుతూ సంపులలో నిల్వ చేసుకుంటూ వాటిని ట్యాంకర్లలో నానక్ రాం గూడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు అక్రమంగా లక్షల రూపాయలు జేబులు నింపుకొంటున్నారు.  ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వట్టినాగులపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు..

కఠిన చర్యలు తీసుకుంటాం 

 నిబంధనకులకు విరుద్ధంగా బోర్లలో నుంచి నీళ్లను తోడుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు. నీళ్లదందా చేస్తే ఉక్కు పాదం మోపుతాం. శ్రీనివాస్ రెడ్డి, గండిపేట తహసిల్దార్