07-07-2024 02:00:28 AM
బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై తీవ్ర నిరసనలు
హత్యను ఖండించిన సీఎం
చెన్నై, జూలై 6: బీఎస్పీ తమిళనాడు చీఫ్ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై రాష్ట్రం అట్టుడికింది. ఆ పార్టీ నాయకులు, అంబేద్కరిస్టులు, ప్రజాసంఘాల నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హత్యపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను రౌడీ మూకలు పొట్టనపెట్టుకున్నాయని, ఆయన బతికి ఉంటే యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతో కృషి చేసే వారన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను సీఎం స్టాలిన్ ‘ఎక్స్’ ద్వారా ఖండించారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం ‘ఎక్స్’ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు కారకులుగా భావిస్తూ ౮ మందిని పోలీసులు అరెస్టు చేశారు.