ఏ దేశ భవిత అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉం టుంది. తమను తాము సంస్కరించుకున్న యువత సామాజిక రుగ్మతలకు అతీతంగా నీతివంతమయిన రాజకీయాల్లోకి రావాలి. సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగిన సామాజిక బాధ్యత కలిగిన యువతగా వీరిని తీర్చిదిద్దడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తలిదండ్రులు మొదలుకొని సమాజంతో పాటుగా ప్రభుత్వాలపైన ఆ గురుతర బాధ్యత ఉందని గుర్తించడం ఎంతయినా అవసరం. ప్రపం చ జనాభాలో దాదాపు ఐదోవంతు ఉన్న భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం .
ప్రపంచ జనాభా అవకాశాల 2022 పునర్విమర్శ ప్రకారం దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. దేశ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే. 65 శాతంకంటే ఎక్కువమంది 35 ఏళ్లలోపు ఉన్నారు. అయితే, భారతదేశంలో పిల్లల సంఖ్య ఒక దశాబ్దం క్రితం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు తగ్గుతోంది. 15 ఏళ్లలోపు భారతీయుల సంఖ్య 2011లో గరిష్ట స్థాయికి చేరుకుంది.
నిరంతర సమస్యలు
భారతదేశంలో విద్య చుట్టూ ఉన్న యువకులను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి . బాల కార్మి కులు , పోషకాహార లోపం , వీధి బాలలు, భారతదేశంలో బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా వంటి ఇతర నిరంతర సమస్యలు ఉన్నాయి . ఈ క్రమంలో దేశం లో దృఢమైన సమర్థవంతమైన యువతను చూడాలంటే అనేక సంస్కరణలు చాలా అవసరం . 6 నుండి 23 మాసాల పిల్లలలో 77 శాతం పోషకాహార లోపం తో బాధపడుతుంటే బలమైన యువత ఎలా సాధ్యమవుతుంది?
కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగాలేని కారణంగా బాల కార్మికులుగా మగ్గిపోతున్నటువంటి బాల లు యువజనులు ఎలా అవుతారు? ఇక బాల్యవివాహాల కారణంగా బాల బాలికలు బలహీనత, అనారోగ్యం, పోష కాహార లోపం ..కారణాలు ఏమైతేనేమి బక్క చిక్కిన యువతగా పనిచేయడానికి ఏ రకంగా అర్హులవుతారో లోచించుకోవాలి. పురిట్లో ,50ఏళ్ల లోపు వయసులో లక్షలాది మంది శిశువులు వివిధ రోగాల బారిన పడి మరణిస్తూ ఉంటే మనం అంచనా వేసిన యువత శాతం తగ్గడమే కాదు ఏ రకంగానూ ఈ దేశ ప్రగతికి దోహదపడే ఆస్కారం లేదు.
ఇన్ని రకాలుగా యువతకు ఆధార భూతమైన టువంటి బాల్య దశలో ఎదుర్కొంటున్న పరిణామాలను పాలకులు, తల్లిదండ్రులు, సమాజం చొరవతో దిద్ది ఆర్థిక పరి స్థితులను బలోపేతం చేసి ఆరోగ్య బాల భారతాన్ని నిర్మిస్తేనే కదా, ఉత్తమ యువలోకం వెలుగు చూసేది. పోషకాహార లోపానికి వ్యవసాయ రంగాన్ని సంస్కరించడంతోపాటు పోషక విలువలు ఉన్నటు వంటి ఆహార పదార్థాలు ఇతర దినుసులను ప్రజలందరికీ నామమాత్రపు రేటు లో ఉచితంగా అందించగలిగినప్పుడు మా త్రమే వారి పిల్లలను, యువతను ఆరోగ్యంగా పెంచే అవకాశం ఉంటుంది.
ఆరో గ్యవంతమైన యువతలో చురుకుదనం తో కూడిన ఆలోచనలు, తద్వారా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలు రూపు దిద్దుకుంటాయి . తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని డాక్టర్ డి ఎస్ కొఠారి అన్న మాటలో అర్థం అదే కదా! బాల్యదశలో ఎదురవుతున్నటువం టి ఆటంకాలను అధిగమించే క్రమంలో ప్రభుత్వాలు తగు రీతిలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించవలసిన అవసరం ఉంటుంది.
పాలనా వ్యవస్థలో క్రియాశీలక పాత్ర
ప్రస్తుత రాజకీయాలు తొలినాళ్లకు భి న్నంగా స్వార్థపూరిత,అవకాశవాద , అనాగరిక , ఆక్రమణ విధానాల బారిన పడి శిథిలమైనందున నీతివంతమైన రాజకీయాలను దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్న తరు ణంలో ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా యువత పెద్ద మొత్తంలో రాజకీయాల్లోకి రావాలి. ఎన్నికల ద్వారా చట్ట సభలకు ఎంపికై పాలనా వ్యవస్థలో క్రియాశీలక భూమిక పోషించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది .
ఈ క్రమంలో యువత తమలో లోపాలను సంస్కరించుకొని దేశ భవిష్యత్తును సవాలుగా తీసు కోవడం ద్వారా నీతివంతమైన పాలన కోసం ఆరాటపడినప్పుడు తప్పకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు చక్కబడతాయి. చురుకైన రాజకీయాలు, అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి తమ శక్తి యుక్తులను, కార్యాచరణను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించడానికి తగిన సమయం కేటాయించగలిగిన యువత ఈ రకమైనటువంటి రాజకీయాలకు అర్హత కలిగి ఉంటుంది.
ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా నూతన విలువలతో కూడుకు న్న రాజకీయాలు యువత చేతికి వస్తే రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంస్థలు, పాల నా వ్యవస్థ, చట్టసభలు పదిలంగా ఉంటాయని దేశం భావిస్తున్నది . దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన పాలన యువత అందిస్తుందని కోరుకోవడం తప్పులేదు.
పెడదారులు పడుతున్న యువత
కానీ యువత ఆ వైపుగా తమను తాను ప్రక్షాళన చేసుకుని తమపై దేశం మోపిన బాధ్యతను సవాలుగా స్వీకరిస్తామని ప్రతిజ్ఞ చేసి వస్తే దేశం యొక్క రూపురేఖలు మారుతాయనడంలో సందే హం ఏమాత్రం లేదు.మద్యం, మత్తు పదార్థాలు, డ్రగ్స్ క్లబ్బులు, పబ్బులు వంటి వాటి కారణంగా యువత నిర్వీర్యం అయిపోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ అవకాశాలన్నింటినీ అందుబాటులో ఉం చి చట్టబద్ధం చేసి ప్రభుత్వాలు యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపణచేస్తే తప్పేమిటి ?
యువత, దేశ ప్రజలు బాగుండాలని గనుక ప్రభుత్వాలకు ఆలోచన ఉంటే ఇలాంటి సా మాజిక రుగ్మతలకు దారితీసే వాటిపై ఉక్కు పాదం మోపవచ్చు కదా! వీటన్నింటిని రద్దు చేయడంతో పాటు కౌన్సిలింగ్ కేంద్రాలను, నైపుణ్య కేంద్రాలను విరివిగా స్థాపించడం ద్వారా యువతలో ఉన్నటువంటి శక్తియుక్తులకు అనుగుణమైనటు వంటి కోర్సులు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది . ప్రతిభావంతమైన రాజకీయ యంత్రాంగంతో పాటు స్ఫూర్తి కలిగినటువంటి ఉన్నతాధికారులు కూడా పాలనకు అవసరమే కదా! ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి ఉన్న తాధికారులను నేటి యువత నుండి ఎంపిక చేసుకుంటున్నప్పుడు యువత నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత పాలకులకు లేదా ?
ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం , భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. చాలామందికి ఆధునిక ఆ ర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలు లే వు. అంచనాల ప్రకారం దేశంలోని యువతలో దాదాపు 51.25 శాతం మంది మా త్రమే ఉపాధి పొందగలరని కూడా పే ర్కొంది. ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరు క ళాశాల నుండి నేరుగా ఉద్యోగాలు పొందలేరు. అయితే, గత దశాబ్దంలో ఇది 34 శా తం నుండి 51.3 శాతం మెరుగుపడిందని గమనించాలి. ఆర్థిక సర్వే 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.5-7శాతం వద్ద వృద్ధి చెందుతుంది.
ఏది ఏమైనా ప్రపంచంలోనే అన్ని దే శాల కంటే ఎక్కువగా యువత ఉందని సంబరపడితే ప్రయోజనం ఏమున్నది! ఆ యువత అన్ని రంగాలలో ముఖ్యంగా పాలనారంగంలో క్రియాశీల భూమిక పోషిస్తే మెరుగైన ఫలితాలను ఆశించడం లో తప్పులేదు. ఆ వైపుగా దేశ యువతను అన్ని రకాల ఆటంకాలు , వ్యవస్థాగత లోపాలు, పాలనాపరమైన డొల్లతనం నుండి కాపాడుకోగలిగితే ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా ఉంటుందని ఆశించడం అతిశయోక్తి కాదు.