17-03-2025 12:00:00 AM
డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండు
బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్
వనపర్తి, మార్చి 16 ( విజయక్రాంతి) : ఆత్మకూరు ఒకప్పడు నియోజకవర్గంగా వెలిగిన గొప్ప చరిత్ర ప్రాంతమని, ఇప్పుడు సమస్యలు తాండవిస్తుండటంతో అవస్థలు పడని పట్టణవాసులు లేరంటే అతిశయోక్తి లేదు అని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలపై నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని 4వ రోజు ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి తీరు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని, 30 పడకల ఆసుపత్రికి కేవలం నలుగురు మాత్రమే డాక్టర్లు ఉండటం శోచనీయమని, ఆదివారం ఇద్దరు సిబ్బంది మాత్రమే డ్యూటీలు చేస్తు న్నారని, అది కూడా వారు వనపర్తి నుంచి డిప్యూటేషనుపై ఇక్కడికి వచ్చారన్నారు.
ఇక రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే జంకుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొదట్లో ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్నది కనుక 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు పెంచి సరిపడా సిబ్బందిని ఇచ్చి పేషంట్లు వనపర్తి, హైదరాబాదు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని కోరారు. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండు చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోందని, బస్టాండుకు వచ్చిన ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సి వస్తుందని రాచాల ఫైర్ అయ్యారు.
ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల వసతులపై ఎందుకు శ్రద్ధ చూపలేకపోతున్నారని, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్లు కన్పిస్తోందన్నారు. ఆత్మకూరుకు కొద్ది దూరంలోనే జూరాల ప్రాజెక్టు ఉంది.
అయినా కూడా రైతులు నీళ్లు వస్తలేవని చెబుతుండటం చూస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందో చెప్పవచ్చు అని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుని, వాళ్లకు సాగు నీరు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.