calender_icon.png 18 January, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండవ హేల పేరిణి!

17-07-2024 07:19:49 AM

పేరిణి అంటే అర్థం?

పేరిణి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఒక ప్రేరణ. శివుడి నుంచి మనకు కావాల్సిన ప్రేరణను పేరిణి ద్వారా పొందుతాం. పేరిణి అనేది ఎలా వచ్చిదంటే నర్తకుడు శివుడి దగ్గర నర్తించడం ద్వారా ప్రేరణ పొంది... ఆ నర్తకుడి పేరు కాస్త పేరిణిగా రూపాంతరం చెందింది. అలా ప్రేరణ నుంచి ఉద్భవించిందే పేరిణి. 

పేరిణి చరిత్ర ఏంటి?

పేరిణి అనేది ఒకటో శతాబ్దం నుంచి ఆరో శతాబ్దం వరకు పరిఢవిల్లిన నాట్యరూపం. నందికేశుడు రాసిన భారత తాండవం పేరిణి నాట్యం గురించి ఉంది. విచారక విషయం ఏంటంటే దానికి సంబంధించిన చరిత్ర మన భారత దేశంలో అందుబాటులో లేదు. దాని పూర్తి చరిత్ర లండన్ లైబ్రరీలో ఉంది. ఇది ఒక పురాతనమైన ఆర్ట్ ఫామ్‌గా మనం గమనించవచ్చు. ఆ సమయంలో భారత నాట్యం, కూచిపూడి ఏం లేవు.

ఆనాటి నుంచి మొదలుకొని ఈ పేరిణి నాట్యం.. అలా కాలక్రమేనా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ నాట్యం అద్భుతంగా విరాజిల్లింది. గణపతి దేవుడి బావమరిది అయిన జాయప్ప సేనాని ఈ నృత్యాన్ని నేర్చుకుని, అవపోసన పట్టి, అర్థం చేసుకొని దీన్ని నాలుగు తెగల వారికి నేర్పించారు. వారిలో వీరులు, మహేశులు, పశుపతులు, మైలారు దేవులు. ఈ నాలుగు తెగలవాళ్లు యుద్ధవీరుల ముందు ప్రదర్శిస్తే.. యుద్ధవీరులకు ప్రేరణ కలిగింది ఆనాడు. 

యుద్ధవీరుల యుద్ధానికి వెళ్లేముందు..“హరహర మహాదేవ శంభో శంకర!!

శివనామస్మరణతో మార్మోగుతూ.. ఆ ఉద్వేగభరితమైన భీజాక్షరాలను పలుకుతూ యుద్ధానికి వెళ్లామని చెబుతారు. ఇది ఇప్పటిది కాదు. ఎన్నో శబ్దాల నాటిది. అలా కాలక్రమేనా.. కాకతీయులు కనుమరుగైన తర్వాత.. ఏదో ఒక దగ్గర.. ఏక్కడో ఒక దగ్గర మారుమోగుతూనే ఉంది. ఇది వరకు మనం తాండవం ప్రదర్శించే వాళ్లం. ప్రస్తుతం కొత్తగా లాస్య తాండవం ప్రదర్శిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లాస్య తాండవం నుంచి ముందుకు వెళ్తున్నాం.

చరిత్ర చూసినట్లయితే.. ముద్దుచంద్రలేఖన అనే ఒక స్త్రీ. ఆస్థాన నర్తకిగా ఉండటమే కాదు.. నేను పేరిణిలో దిట్ట అని చెప్పడం జరిగింది. ఏదైనా కళరూపం నిండుగా ఉంటేనే కాలకాలం నిలుస్తుంది. పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణగారు చేసిన కృషి ఏంటంటే.. తాండవాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. దాని తర్వాత కళాకృష్ణగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్త్రీలు చేసే లాస్యా న్ని కూడా ప్రదర్శించడం మొదలు పెట్టారు. అప్పుడు పేరిణిని శివతాండవం అని పిలిచేవారు. ఇప్పుడు పేరిణిని నాట్యం అని కూడా పిలుస్తున్నాం. ఇది పరిపూర్ణమైన నాట్యం. 

పేరిణిలో ఎన్ని హస్తలు ఉంటాయి?

ఏ కళాకైనా కొన్ని రకాల హస్తలు(ముద్ర)లుంటాయి. వాటిలో సంయుక్త, అసంయుక్త, దేవత హస్తలు అని ఉంటాయి. ఇవి ప్రతి కళరూపానికి ఉంటాయి. అది భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీలో ఇలా ప్రతిదాంట్లో మనకు ముద్రలు (హస్తలు) కనిపిస్తాయి. ఈ మూడు రకాలైన హస్తలు ప్రధానంగా చూడవచ్చు. ప్రతి కళారూపానికి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. 

ఈ కళారూపాన్ని అమ్మాయిలు అనుసరిస్తున్నారా?

మన తెలంగాణ రాష్ట్రంలో పేరిణి కళాకారులు రెండు వేల మంది ఉన్నారు. వారిలో దాదాపు వెయ్యి మందికి పైనే అమ్మాయిలు ఈ కళారూపాన్ని అనుసరిస్తున్నారు. చెప్పాలంటే ఇప్పుడు అబ్బాయిల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది వరకు అబ్బాయిలే అమ్మాయిల గేటప్‌లు వేసుకొని నాట్యం చేసేది. అమ్మాయిలు పెద్దగా రాకపోయేది. ప్రస్తుతం ఎక్కువశాతం అమ్మాయిలు నేర్చుకుంటు న్నారు. మన తెలంగాణలో ఆరు మ్యూజిక్ కాలేజీల్లో ముగ్గురు మహిళా లెక్చరర్‌లు పేరిణి నాట్యాన్ని నేర్పిస్తున్నారు. ఇది   వీరత్వాన్ని, రౌద్రాన్ని చూపించగలిగే నాట్యం ఏదన్నా ఉందంటే అది పేరిణి నాట్యం మాత్రమే.   

ఈ కళరూపానికి ప్రభుత్వం నుంచి ఆదరణ ఎలా ఉంది?

చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇవాళ పేరిణి కళకారుడిగా గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో కూడా ‘భాషా శాఖ’ చేస్తున్న కృషి, ప్రోత్సాహం కారణంగా అందరు కళాకారులు సంతోషంగా ఉన్నారు. 

పేరిణి నృత్యం మీద ఏమైనా పరిశోధన జరిగిందా? 

రామప్ప శిల్పాలను చూసి ఉత్తేజితుడైన డా. నటరాజ రామకృష్ణ, 1980వ దశకంలో అనేక పరిశోధనలు చేసి పేరిణి నృత్యానికి తిరిగి ప్రాణం పోశారు. ఇందుకోసం ‘నృత్య రత్నావళి’ అనే గ్రంథాన్ని మార్గదర్శిగా ఎంచుకొన్నారు. చరిత్ర గతమైన పేరిణి నాట్యాన్ని పేర్చి, కూర్చి, తీర్చిదిద్ది జన బాహుళ్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పేరిణి నృత్యాన్ని రెండు సంప్రదాయాల్లో ప్రదర్శిస్తున్నాం. పురుషులు చేసే నృత్యాన్ని ‘పేరిణి తాండవం’ అని, మహిళలు చేసే నృత్యాన్ని ‘పేరిణి లాస్యం’ అని పిలుస్తారు. పేరిణిని ప్రదర్శించే కళాకారులు, శివుణ్ణి తమలో ఆవహించుకొని ఆవేశంతో ఈ నృత్యం చేస్తారు. ఉత్తేజపరిచే మృదంగ శబ్దం ఆ నృత్యకారులను ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే వారు ‘పేరిణి’ నృత్యాన్ని ‘శివ తాండవ’ నృత్యంగా మలుచుకొంటారు. 

పేరిణి ఆనవాళ్లు ఎక్కడ కనిపిస్తాయి? 

కాకతీయులు నిర్మించిన శివాలయాల్లో ఆరాధనా నృత్యాలు చేసేవారు. నాటి పాశుపతులు, సంగీత నృత్యాలతో త్రికాలాల్లోనూ మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న వేదికలపై ‘నాట్య నివేదన’ చేసేవారు. అలాంటి వేదికలను వరంగల్ కోటతో పాటు, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ముఖ మండపం, రామప్ప దేవాలయంతో పాటు ఇతర కాకతీయ ఆలయాల్లో నేటికీ చూడవచ్చు. ‘నృత్య రత్నావళి’ లోని భంగిమలు రామప్ప ఆలయంపై శిల్పాలుగా దర్శనమిస్తాయి. వాటిలో పేరిణి నృత్యాన్ని ప్రతిబింబించే శిల్పాలూ అనేకం. ఆలయ గర్భగుడి ప్రవేశ ద్వారానికి రెండు వైపులా ఉన్న 64 శిల్పాలు.. పేరిణి నృత్య కళాకారులవే. మృదంగాన్ని వాయిస్తున్నట్లు కనిపించే శిల్పాలు కూడా ఉన్నాయి.

ఈ నృత్యాన్ని ఏఏ సందర్భాల్లో ప్రదర్శిస్తారు? 

పేరిణి నాట్యాన్ని ఆనాడు యుద్ధానికి వీరుల ముందు చేసేవారు. యుద్ధం గెలిచి రావడానికి ప్రేరణగా ఈ నృత్యాన్ని చేసేది. తర్వాత దేవాలయాల్లో శివుడి ముందు చేస్తారు. ఇవాళ కూడా ప్రజల్లో ఒక ప్రేరణను, మోటివేషన్ను తీసుకురావాలని ఈ నృత్యాన్ని  ప్రదర్శిస్తుంటాం. 

ఏ వయసు నుంచి పేరిణి నేర్చుకున్నారు? 

నా ఎనిమిదేళ్ల వయసులో పేరిణి నాట్యాన్ని నేర్చుకున్నాను. ఇప్పటికి 27 ఏళ్లు అవుతుంది. ఈ కళారూపాన్ని వొదిలిపెట్టి జీవించలేను. నాకంటూ ఒక గుర్తింపు వచ్చిదంటే అది కేవలం పేరిణి నాట్యం ద్వారా మాత్రమే. ఈ 27 ఏళ్ల అనుభవం చాలా అద్భుతం. సహజంగా నేనొక బంజారా బిడ్డను. ఊర్లల్లో జరిగే తీజ్ పండుగ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రంపూట డ్యాన్స్ చేస్తాం. అలా మా అమ్మ, నాన్న చేస్తుంటే వాళ్లను నేను అనుకరించేది. అక్కడి నుంచి నా జర్నీ మొదలైంది.

మా ఊర్లో ‘జానపదం’ అనే డ్యాన్స్ క్లాస్ మొదలుపెట్టారు  సోషల్ టీచర్ లింగబాబుగారు. ఆ జానపదం నుంచి భారత దేశం అంతటా తిరగడం జరిగింది. మా గురుగారు అయిన అప్జల్ పాషాగారికి మా బాబాయ్ కారు డ్రైవింగ్ చేసేవారు. అలా లైఫ్ టర్నింగ్ చేసింది ఎవరంటే మా బాబాయ్ కరుణాకర్ అని చెప్పొచ్చు. మా గురువు అఫ్జల్ పాషా గారు ముస్లిం కాని తెలుగు పండితులు, తెలుగు సంప్రదాయాలు, కట్టుబాట్లు తుచ, తప్పకుండా పాటించేవారు. అంతన్ని చూస్తే ఆశ్చర్యం కలిగేది. అలా నా జీవితం మారిపోయింది. ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు.. కనీసం గురువు గారి దగ్గర ఉంటే వాడన్నా మంచిగా బతుకుతాడు అని మా తల్లిదండ్రులు వొదిలిపెట్టారు. 

అలా గురువుగారికి సేవలు చేస్తూ నృత్యాన్ని నేర్చుకున్నా.. సంవత్సరానికి పేరిణి అనే నాట్యం ఉందని తెలిసింది. అప్పుడు వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో  పద్మశ్రీ డా. నటరాజకృష్ణ గారు 45 రోజుల పేరిణి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాకృష్ణగారు, బండి పేరిణి కుమార్‌గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాను. నటరాజకృష్ణగారు నా పేరిణిని చూసి నన్ను, నా మిత్రుడు నరేష్‌ను సెలెక్టు చేసుకొని హైదరాబాద్‌కు రప్పించుకున్నారు. అలా సార్‌తో ఒక సంవత్సరం పాటు గురుకులం స్టుల్లో పేరిణిని నేర్చుకున్నాం. నాట్యం ఆనందం కోసమో.. ఆరోగ్యం కోసమో కాదు. దీని వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయని మా గురువుగారు చెప్పేవారు. ఎందుకంటే మన సంస్కృతిలో జ్ఞానం దాగుంది.     

మీ డ్యాన్స్ అకాడమీ గురించి?

నా డ్యాన్స్ అకాడమీ పేరు పీఆర్‌కే నాట్య ప్రపంచం. పీఆర్‌కే అంటే పేరిణి రాజ్ కుమార్ అని అర్థం. ఇప్పుడు నా అకాడమీలో దాదాపు 70మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, దేవాలయాలలో పేరిణి నాట్యాన్ని 101 రోజుల వ్యవధిలో 200 కార్యక్రమాలను నిర్వహించాను. ఈ ప్రపంచంలో ప్రతి కదలిక నాట్యంతోనే ముడిపడి ఉంటుందనే నా అభిప్రాయం. ఈ స్థాయికి ఎదగడానికి కారణం యోగా గురువులు ప్రసాద్, రాజేశ్వరిగారు, బ్యాంక్ మేనెజర్ రమేష్‌గారు. వీరి సహకారం నా జీవితంలో మరిచిపోలేను.