calender_icon.png 25 October, 2024 | 7:06 AM

దత్తత పేర ములగడ్ చెరువుకు ఎసరు!

29-08-2024 12:13:44 AM

  1. సుందరీకరణ కోసం ముందుకొచ్చిన నిర్మాణ సంస్థలు 
  2. ఈ ముసుగులో 90 ఎకరాల ఎఫ్‌టీఎల్ కబ్జా 
  3. గత సర్కారులో కీలకంగా వ్యవహరించిన మంత్రి 
  4. వైష్ణో, ప్రెస్టేజ్ సిటీ సంస్థలపై చర్యలు శూన్యం

రాజేంద్రనగర్, ఆగస్టు 28: రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట్, గగన్ పహడ్ రెవెన్యూ పరిధిలో ఉన్న ములగడ్ (పెద్దచెరువు) చెరువు కబ్జా కోరల్లో చిక్కుకున్నది. చెరువును సుందరీకరణ చేస్తామని దత్త త తీసుకున్న నిర్మాణ సంస్థలు దాదాపు చెరువుకు సంబంధించిన 90ఎకరాల స్థలాన్ని కబ్జా చేశాయి. ప్రేమావతిపేట్‌లోని 81 సర్వేనంబర్లు, గగనపహడ్‌లోని 239 సర్వే నంబర్‌లో ములగడ్ చెరువు విస్తరించి ఉంది. చెరువును సుందరీకరణ చేసి అందుబాటులోకి తీసుకొస్తామని గత బీఆర్‌ఎస్ హయాం లో వైష్ణో, ప్రెస్టేజ్ నిర్మాణ సంస్థలు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు పొందాయి.

సుందరీకరణ పేరుతో చెరువు వద్ద ఆకర్షించే పనులు చేశారు. ఆ తర్వాత వారి అసలు రూపం బయటపడింది. స్థానికులను ఎవరినీ చెరు వు వద్దకు రానివ్వకుండా కబ్జాకు తెరలేపాయి. చెరువును తాము దత్తత తీసుకున్నామని, ఎవరూ రావొద్దని ఆయా సంస్థల సిబ్బంది బెదరగొడుతున్నారు. తమ ను రానివ్వకుండా చెరువును ఎవరి కోసం సుందరీకరించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

మాజీ మంత్రి అండతో అనుమతులు

వైష్ణో, ప్రెస్టేజ్ సిటీ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా గగన్‌పహడ్‌లోని ములగడ్ చెరువు సమీపంలో సుమారు 65 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ స్థాయిలో అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు చేపడుతున్నాయి. వందకు పైగా విల్లాలను కూడా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు గత బీఆర్‌ఎస్ సర్కారులో ఓ మంత్రి అనుతమతులు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు. మంత్రి రంగంలోకి దిగడంతో పెద్ద చెరువు సుందరీకణ చేపడుతామని ఆ సంస్థలు చెప్పడంతో అన్నిశాఖల అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

లేక్ వ్యూ పేరుతో భారీగా అమ్మకాలు

లేక్ వ్యూ పేరుతో నిర్మాణదారులు భారీ గా ఆకర్షిస్తున్నారు. సహజసిద్ధమైన చెరువు పక్కనే నిర్మాణాలు అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ ఎక్కువ ధరలకు విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముతున్నారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు నిర్మాణాలు చేపడుతున్నా అడిగే నాథుడే లేడు.

హైడ్రా కన్నేయాల్సిందే..

నిబంధనలకు విరుద్ధంగా చెరువు పక్కనే, బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టిన వైష్ణో, ప్రెస్టేజ్ సిటీ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. హైడ్రా అధికారులు దృష్టిసారిం చి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

విచారణ జరుపుతాం

గగన్‌పహడ్ సమీపంలో ప్రెస్టేజీ సిటీ, వైష్ణో నిర్మాణ సంస్థలు ములగడ్ చెరువును దత్తత తీసుకొని స్థానికులను అక్కడికి రానివ్వడం లేదనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకంటాం. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా స్థానికులను అనుమతించాలి. 

 వెంకట్‌రెడ్డి, ఆర్డీవో, 

రాజేనంద్రనగర్ 

సుందరీకరణ పేరిట చెరువు ధ్వంసం

చెరువును సుందరీకరణ పేరుతో చెర పట్టిన నిర్మాణ సంస్థల నిర్వాహకులు దానిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా రిటెయింగ్ వాల్ నిర్మించారు. చెరువు తూర్పు భాగంలో ‘లవ్ ప్రెస్టేజీ సిటీ’ అంటూ ఆకర్షణీయమైన నిర్మాణం చేపట్టారు. చెరువు బఫర్ జోన్‌లోనే నిర్మాణాలు చేపట్టారు. దీంతో మట్టి కూరుకుపోయి అపార్టుమెంట్ల కోసం తవ్విన గుంతల్లోకి నీళ్లు జాలువారుత్నుది.