calender_icon.png 9 October, 2024 | 3:00 PM

పేరు ‘అభివృద్ధి’.. జరిగింది విధ్వంసం!

09-10-2024 12:00:00 AM

తెలంగాణ గడ్డకు పోరాటాలు, ఉద్యమాలు కొత్తేమీ కాదు. ఈనేలపై ప్రతి బిడ్డకు పోరాటాలు ఉగ్గుపాలతో సమానం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ఇక్కడి ప్రజల్లో అణువణువునా ఉంది. సీమాంధ్ర పాలనలో కొనసాగిన వివక్ష, అణచివేతను ధిక్కారస్వరంతో ప్రతిఘటించారు. ఆత్మగౌరవ నినాదాన్ని అజెండాగా మల్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలను స్థానికులకే దక్కాలనే యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు.

అయితే రాజకీయ నేతల మోసపూరిత హామీలకు బలికాకుండా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గురువులున్నారు. తెలంగాణ నా జన్మ హక్కు అని చాటిన మేధావులూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  ‘తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ’ ఉద్యమానికి ఏవిధమైన చేయూతనిచ్చింది? హక్కుల కోసం ఎలా పోరాడింది? లాంటి విషయాలు కమిటీ అధ్యక్షుడు శ్యాం సుందర్‌గౌడ్ మాటల్లోనే తెలుసుకుందాం..!

‘ఆనాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను తిరగనివ్వం’ అని మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ ప్రకటించగా.. ‘నేనెక్కడైనా తిరుగుతానని, దమ్ముంటే అడ్డుకోవచ్చని’ లగడపాటి తెలంగాణ ఉద్యమకారులకు సవాల్ విసిరాడు. దీంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద నేను చొక్కా పట్టుకుని నేలపై కూర్చోబెట్టా.

లగడపాటిని అడ్డుకోవాలని చెప్పిన నేతలే.. ఆ తర్వాత నన్ను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రం కోసం సామాన్యులు యుద్ధం చేస్తుంటే, రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం చేస్తున్నారని ఆ సమయంలో అర్థమైంది. 

సందర్భం-1

2006 ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ బహిరంగసభలో.. తెలంగాణ రాష్ట్రం ఈ దఫా రాకుంటే సాయుధ పోరాటం తప్ప.. మరోమార్గం లేదని తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో ‘శ్యాం.. ఇలా రా’ అంటూ ప్రొ. జయశంకర్ పిలిచి నా భుజాలపై చేతులేసి వేదికపైకి ఎక్కారు. ఆ సభ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ఏ సభకు అటెండ్ కాలేదు.

అనంతరం అనారోగ్యంతో మరణించారు. దీంతో పోతూపోతూ తెలంగాణ ఉద్యమ భారాన్ని నా భజస్కంధాలపై వేసినట్టుగా ఆ సందర్భంగా గుర్తుకువచ్చినప్పుడల్లా ఒళ్లంతా పులకరించి పోయేవాణ్ని. “రాజకీయ నాయకులు ఎప్పుడూ వారి స్వార్థం కోసమే పనిచేస్తారు, వాళ్లను ఎప్పుడూ నమ్మోద్దు” అంటూ ప్రొ. కేశవరావు జాదవ్ పలుమార్లు హితబోధ చేసిన సందర్భాలెన్నో.

సందర్భం-2

2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరగానే పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా తెలంగాణ అంతటా తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఎల్‌బీనగర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ విగ్రహం సాక్షి గా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు శ్రీకాంతాచారి.

డిసెంబరు 3న శ్రీకాంతాచారి చికిత్స పొందుతూ అమరత్వం పొందాడు. తెలంగాణ అగ్నిగుండంగా మారడంతో కేంద్రం దిగొచ్చి డిసెంబరు 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రెండు వారాలు తిరగకముందే డిసెంబరు 9 ప్రకటనను వెనక్కి తీసుకుంటూ డిసెంబరు 23న మరో ప్రకటన చేసింది కేంద్రం. 

జైలులోనే నామకరణం

తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశా. ఈ క్రమంలో చర్లపల్లిలో 6 రోజుల జైలు జీవితం గడిపాను. అనేక కేసుల్లో ఏ1గా ఉన్నా. ఈ సమయంలో ప్రొ.జయశంకర్, ప్రొ.కేశవరావు జాదవ్‌లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మిలటరీ, సాయుధ పోరాట పంథా మార్గాలో ఉండాలని చెప్పే అంశాలు పదే పదే గుర్తుకొచ్చేవి.

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 2 లక్షల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్టుగా ప్రొ. జయశంకర్ సార్ చెప్పారు. ఈ భూములను పరిరక్షించుకుంటే 10 ఏళ్లకు సరిపడా బడ్జెట్ అవుతుందని, తద్వారా తెలంగాణకు నిధుల కొరత ఉండదన్నారు.

దీంతో అదే జైలులో రాజకీయ పార్టీల జేఏసీకి ప్రత్యామ్నా యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజలను మరింత చైతన్యం చేయాలని భావించి 2010లో ‘తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ’కీ జైలులోనే నామకరణం చేశాం. తెలంగాణ వనరులన్నీ దోపిడీకి గురవుతున్న నేపథ్యంలో “మన రాష్ట్రం మన లక్ష్యం, వనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం” అంటూ ప్రజలకు పిలుపునిచ్చాం.

అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసాన్ని అరికట్టాలి 

తెలంగాణ రాష్ట్రం వచ్చింది సంతోషమే. కానీ, ఉద్యమ ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు సైతం మన వనరులను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మరింత విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుంది.

ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో 25 వేల ఎకరాల భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతోంది. కొండలన్నీ నేలమట్టం అవుతున్నాయి. సారవంతమైన భూములు లోయలుగా తయారవుతున్నాయి. తెలంగాణను సుస్థిరంగా అభివృద్ధి పర్చుకోవాలంటే ముందుగా ఉన్న వనరులు విధ్వంసం కాకుండా కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం రికవరీ చేసుకోవాలి.

అందుకు తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలి. ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం వల్ల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా కన్పిస్తుంది. కానీ ఉద్యమకారులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమ సాధకులుగా గుర్తించాలి. 

 శ్యాం సుందర్‌గౌడ్, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు 

తెలంగాణ నా జన్మ హక్కు..

నాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ గ్రామం. మేధావుల సాన్నిహిత్యం కారణంగా తెలంగాణ ఉద్యమం అంటే కేవలం భౌగోళికంగా విడిపోవడమే కాదు.. తెలంగాణ వనరులు, సంపదను పరరిక్షించుకునే ఉద్యమం అని స్పష్టతకొచ్చాను. వాళ్ల ప్రభావంతో “నేను సైతం తెలంగాణకు ప్రాణార్పణ చేస్తున్నా.. రాజకీయం నాకు వద్దు.. రాష్ట్ర సాధనే నా లక్ష్యం అంటూ.. తెలంగాణ గడ్డన పుట్టిన గడ్డి పోసను నేను”.. అంటూ కవితలు రాసి ప్రజల్నీ చైతన్యం చేశాం.

ఈ క్రమంలోనే తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ పేరుతో విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యేలా చేశాం. ఒక వైపు జేఏసీ కార్యక్రమాలలో పాల్గొంటూనే.. మరో వైపు ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థలను బహిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాలపై ఏపీ పేరు తొలగించి తెలంగాణ అని లేదా టీజీ అని రాయడం, మిలియన్ మార్చ్, సాగరహారం సందర్భంగా ట్యాంక్‌బండ్‌తో సహా పలు ప్రాంతాల్లో అప్పటికప్పుడే ‘తెలంగాణ నా జన్మ హక్కు’ అనే నినాదాన్ని రాసి ఉద్యమాన్ని మరింత పదునెక్కించే ప్రయత్నం చేశాం. సహాయ నిరాకరణ, నిరసనలు, దీక్షలు, ధర్నాలతోపాటు ఆర్టీసీ బస్సుల్లో స్టిక్కర్లు అంటించడం వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టాం. సమయంలో నాపై పలు కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ 

అధ్యక్షుడు - గోర శ్యాం సుందర్ గౌడ్, సభ్యులుగా మారోజు రామాచారి, స్వామి యాదవ్, సల్వా చారి, శ్యామ్, యూసుఫ్, ఎస్. రవి, రాములు, శోభన్, ఆయిల్ రెడ్డి, అమర్‌నాథ్, పి. రాజేష్ 

 వంగూరి గోపాలరావు, సిటీబ్యూరో