calender_icon.png 17 January, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిన డబుల్ మర్డర్ మిస్టరీ

17-01-2025 02:30:22 AM

  1. మధ్యప్రదేశ్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్
  2. ఏకాంత వీడియోలను నిరాకరించినందుకు కక్ష
  3. దీంతో ఇద్దరిని హతమార్చిన వైనం 
  4. వివరాలు వెల్లడించిన డీసీపీ సీహెచ్ శ్రీనివాస్

రాజేంద్రనగర్, జనవరి 16: రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను మధ్యప్రదేశ్‌లో గుర్తించి, అరెస్ట్ చేశారు. కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివాకర్, బిందు(25) దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.

వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలో నివాసముంటున్నారు. గతంలో వీరికి అంకిత్ సాకేత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో బిందు, అంకిత్ సాకేత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. హౌస్ కీపింగ్ పనిచేసే అంకిత్ సాకేత్ నానక్‌రామ్‌గూడలో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ అనంతపద్మనాభస్వామి ఆలయ గుట్టల్లో వీరిద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు.

దుండగులు వీరిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అక్కడున్న ఆనవాళ్లను బట్టి వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యలు జరిగినట్లు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేశారు. 

వీడియోలు వద్దన్నందుకు హత్య

ఈనెల 8వ తేదీ బిందు తన ఇంట్లో నుంచి భర్తపిల్లలను వదిలేసి అంకిత్ సాకేత్ వద్దకు వచ్చింది. అయితే ఆమె సెక్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఆమెతో ఏ1 నిందితుడైన రాహుల్ కుమార్ సాకేత్ గతంలో రెండుసార్లు ఆమెతో గడిపాడు. ఏకాంత సమయంలో అతడు వీడియోలు తీసుకునేందుకు యత్నించగా బిందు నిరాకరించింది. ఈవిషయాన్ని అంకిత్‌సాకేత్‌కు చెప్పడంతో అతడు రాహుల్‌ను తీవ్రంగా మందలించాడు.

దీంతో అతడు వీరిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని పథకం పన్నాడు. ఇందుకోసం అతడు ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాడు. రాజ్‌కుమార్ సాకేత్, సుకేంద్ర కుమార్ సాకేత్‌తో కలిసి చంపేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా 11వ తేదీ రాత్రి మరోమారు రాహుల్ కుమార్ సాకేత్ రూ.4 వేలు ఇచ్చి మరోసారి ఏకాంతంగా గడిపేందుకు బిందుకు డబ్బులు ఇచ్చాడు. ఈక్రమంలో ఆటోలో అనంతపద్మనాభస్వామి గుట్టల ప్రాంతానికి వచ్చారు.

రాహుల్, బిందు ఒంటరిగా ఉండగా కొద్దిదూరంలో ఉన్న అంకిత్ సాకేత్‌ను ఏ2, ఏ3 నిందితులు రాజ్‌కుమార్, సుకేంద్రకుమార్ కత్తులతో పొడిచి బండరాయితో ముఖంపై మోది చంపేశారు. అనంతరం బిందు వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి చంపేశారు. అనంతరం నిందితులు తమ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌కు పారిపోయారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.