భర్త ఉద్యోగం కోసమే భార్య పక్కా స్కెచ్.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.
తల్లితో పాటు తమ్ముడి సహకారం.
కల్తీ కల్లులో సిహెచ్ కలిపి తాగించిన వైనం
70కిలో మీటర్లు కారులో తరలించి కాల్వలో ముంచి హత్య.
ఆరుగురి రిమాండ్, మరొకరు పరార్.
మరికొందరిని తప్పించే యత్నంలో పోలీసులు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న జగదీష్ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. జీవితాంతం కలిసి బ్రతుకుదామని వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడిన భార్యే కామంతో కళ్ళు మూసుకొని ప్రియుడు మోజులపడింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని తల్లి తమ్ముడితో పాటు ప్రియుడు, ప్రియుడి స్నేహితులతో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఆ నింద వారిపై పడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ హత్యోదంతలో పాలుపంచుకున్న ఏడుగురులో ఆరుగురిని రిమాండ్ కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నట్లు డిఎస్పి బుర్రి శ్రీనివాసులు మీడియా ముందు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతపల్లి జగదీశ్(35) కి తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఆటెండర్ ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు. గద్వాల ప్రాంతానికి చెందిన తన భార్య కీర్థితో 2011లో ప్రేమ వివాహం జరిగింది. తరచూ వారి మధ్య గొడవలు జరిగడంతో పెద్దల సమక్షంలోనే సర్దుబాటు చేశారు. కాగా పటంలోని బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలతో ఏర్పడిన పరిచయం వల్ల కల్వకుర్తి ప్రాంతంలోని ఎస్బిఎం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సేల్స్ ఉమెన్ గా పనిచేసింది. అక్కడే పనిచేసే బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన మండలి నాగరాజుతో పరిచయమై అది అక్రమ సంబంధానికి దారి తీసింది. విషయం ఇరు కుటుంబంలో తెలియడంతో భార్య కీర్తిని భర్త జగదీష్ మందలించాడు.
దీంతో భర్తను అడ్డు తొలగించుకుని తమ అక్రమ సంబంధం కొనసాగడంతో పాటు భర్త ఉద్యోగాన్ని కూడా పొందొచ్చని ప్లాన్ వేసుకున్నారు. ప్రియుడి స్నేహితుడు పాలెం గ్రామానికి చెందిన సోప్పరి శివ, జిల్లా కేంద్రంలో నకిలీ రిపోర్టర్గా వ్యవహరిస్తున్న కాకునూరి సుధాకర్, కల్తీ కళ్ళు తయారీదారు నకిలీ రిపోర్టర్గా ఉన్న మోహన్ గౌడ్ చేతులు కలిపారు. జగదీష్ ఇష్టంగా తాగే చెట్టు కల్లులో (సిహెచ్) కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే మత్తు పదార్థాన్ని హత్యకు అస్త్రంగా వాడుకున్నారు. ఈ నెల 24న దైవదర్శనం పేరుతో తన తల్లి గారి ఊరైన గద్వాలకు భర్తను వెంటబెట్టుకొని వెళ్లి అక్కడే చెట్టు కల్లు పేరుతో కల్తీకల్లులో మత్తు పదార్థాన్ని వేసి తాగించారు. మత్తులోకి జారుకున్న తర్వాత పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులోని డిక్కీలో కుక్కి 70 కిలోమీటర్లు తరలించి జగదీష్ సొంత గ్రామం తూడుకుర్తి లోని తన పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి చనిపోయినట్లుగా పతకం రచించారు.
ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పక్కనే ఉన్న కేఎల్ఐ కాలువలోకి తోసి హతమార్చారు. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాగా ఈనెల 25న బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాల్వలో మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కీర్తి వారి తల్లి పద్మ, తమ్ముడు సాయికుమార్, ప్రియుడు నాగరాజుతో పాటు ప్రియుడి స్నేహితులు సొప్పరి శివ, కాకునూరి సుధాకర్, మోహన్ గౌడ్ లు అందరూ హత్యకు సహకరించారు. దీంతో పోలీసులు ఆరుగురిని రిమాండ్ కు తరలించగా మోహన్ గౌడ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.