- మూసీనది హద్దులను కేసీఆర్ సర్కారే నిర్ణయించింది
- కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు రాజకీయమా!
- బీఆర్‌ఎస్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తమ హయాంలోనే మూసీ సుంద రీకరణ చేపట్టాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్.. అదే అంశమై ఇప్పుడు రాజకీయం చేస్తోందని వైద్యఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసిందే గత ప్రభుత్వమని, నదికి హద్దులను కూడా కేసీఆర్ సర్కారే నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మూసీ నిర్వాసితులకు 2బీహెచ్‌కే ఇండ్లు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిర్ణయించింది గత సర్కారేనని, వారే మూసీకి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారన్నారు.
మూసీ పక్కన జీవించే ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 14 గ్రామాలు ముంపునకు గురయితే వారి నిర్వాసితుల పట్ల బీఆర్‌ఎస్ సర్కార్ ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు.
కానీ తాము మాత్రం మూసీ నిర్వాసితులకు కచ్చితంగా అండగా ఉంటామని హమీ ఇచ్చారు. మూసీపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని దామోదర్ తెలిపారు. గాలి మాటలు, అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.