calender_icon.png 26 February, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబసభ్యులను చంపిన కిరాతకుడు

26-02-2025 12:02:56 AM

ఆపై విషం తాగి పోలీస్ స్టేషన్‌లో సరెండర్

తిరువనంతపురం, ఫిబ్రవరి 25: తిరువనంతపురం జిల్లాలోని వెంజరమూడుకు చెందిన 23 సంవత్సరాల అఫన్ తన తల్లి, సోదరుడు, నానమ్మ, బాబాయ్, పిన్ని, ప్రియురాలులను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను కూడా విషం సేవించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తన కుటుంబంలోని 6గురు వ్యక్తులను హత్య చేసినట్లు అఫన్ పోలీసులకు తెలిపాడు. పోలీసులు అఫన్ చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేయ గా.. మృతదేహాలు లభించాయి. ఆ మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.. అఫన్, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అఫన్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించారు. 

అదే కారణమా? 

అఫన్ ఇలా తన సొంత కుటుంబీకులను చంపడం మిస్టరీగా మారింది. అసలు కారణం ఏం అయి ఉంటుందా అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే అఫన్ తండ్రి విదేశాల్లో వ్యాపారం చేస్తూ నష్టపోయినట్లు.. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చి ఇటీవలే విజిటింగ్ వీసా మీద మరలా విదేశాలకు వెళ్లినట్లు అఫన్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబం మొత్తం విషం తాగి మరణించాలని అనుకుందని, విషం తాగితే కొంత మంది బతికే అవకాశం ఉండడం వల్లే తానే అందరినీ హత్య చేశానని, తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నం చేశానని స్పృహ కోల్పోయే ముందు అఫన్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అఫన్ స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.