calender_icon.png 8 November, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బంగ్లా’లో యువ నటుడి హత్య

08-08-2024 12:13:27 AM

కర్రలతో కిరాతకంగా దాడి చేసిన అల్లరి మూకలు

షేక్ ముజిబుర్ రెహమాన్‌పై బయోపిక్ తీసినందుకే టార్గెట్

ఢాకా, ఆగస్టు 7: బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. హింస చేలరేగుతూనే ఉంది. రక్తపాతం జరుగుతూనే ఉంది. అల్లరి మూకల ఆగడాలు ఆగడం లేదు. అవామీ లీగ్ పార్టీతో పాటు ప్రధాని హసీనాకు మద్దతు ఇచ్చిన వారిని వారు టార్గెట్ చేస్తున్నారు. హసీనా తన పదవికి రాజీనామా చేయగానే ఆమె తండ్రి అయిన బంగ బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితంపై 2021లో ‘తుంగిపరార్ మియా భాయ్’ సినిమాను తెరక్కించిన నిర్మాత సెలిమ్ ఖాన్‌తో పాటు ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన అతడి కుమారుడు, యువనటుడు శాంతోఖాన్‌ను టార్గెట్ చేశారు.

సోమవారం రాత్రి చాంద్‌పూర్‌లోని వారి స్వగ్రామానికి వెళ్లి, ఇంట్లోకి చొరబడి కర్రలతో సెలిమ్‌ఖాన్, శాంతోఖాన్‌పై కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఆత్మరక్షణ కోసం సెలిమ్‌ఖాన్, శాంతోఖాన్ తుపాకులతో కాల్పులకు దిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వారిద్దరూ కన్నుమూసినట్లు అక్కడి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. సెలిమ్‌ఖాన్ గతంలో అవామీ లీగ్ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. కొన్నేళ్ల క్రితం పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాడు. పార్టీతో ఆయనకు పెద్దగా సత్సంబం ధాలు లేనప్పటికీ ఆందోళనకారులు ఆయన్ను టార్గెట్ చేశారు. హత్యపై అక్కడి ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళ నకారులు విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని,  హింసకు పాల్పడడాన్ని ఖండిస్తున్నాయి.

మంచినటుడిగా శాంతోఖాన్‌కు పేరు..

శాంతోఖాన్ 2019లో సినీపరిశ్రమలోకి ప్రవేశించారు. ‘ప్రేమ్ చోర్’ సినిమాతో అరంగేట్రం చేశారు. తర్వాత వరుసగా ‘పియా రే’, ‘బుబుజాన్’, ‘ఆంటోనగర్’ చిత్రాల్లో నాటించారు. 2021లో బంగ్లా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ ‘తుంగిపరార్ మియా భాయ్’ చిత్రంలో ఆయన పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కానీ.. ఆ సినిమాలో నటించడమే చివరకు శాపమైంది. 

కలకత్తా సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి

సెలిమ్‌ఖాన్, శాంతోఖాన్ హత్యపై కలకత్తా సినీపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఎంతోమంది నటీనటులు బంగ్లా సినిమాల్లోనూ నటించారు. ‘శాంతో హత్యకు గురయ్యారనే విషయం నన్ను బాధించింది’ అని నటుడు రజతభా దత్తా స్పందించారు.