నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందీ సినిమా. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ప్రగ్యా జైస్వాల్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
2015లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమా లతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను. బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను.
కోవిడ్ సమయంలో బోయపాటి గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా నా సినీ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మం చి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను.
కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. బాబీ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. సెట్స్‌లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాలకృష్ణ గారిని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతూ ఉంటారు. సెట్స్‌లో బాలకృష్ణ గారు అందరి తో ఎంతో సరదాగా ఉంటారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది.
నాగవంశీ గారు గొప్ప నిర్మాత. దర్శకులను, టీంని ఎంతో నమ్ముతారు. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు. బాలకృష్ణ గారి సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుం ది. ‘డాకు మహారాజ్’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగా నో నచ్చింది.
దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకు ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను.