ఉద్యమ ప్రస్థానం స్పూర్తిదాయకం..
సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం..
ప్రతాప రెడ్డి రచించిన రెండు గ్రంధాల ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): భారత స్వాతంత్రోద్యమంలోనూ, చారిత్రాత్మకమైన తెలంగాణ సాయుద రైతాంగ పోరాటంలోనూ నాట తలెత్తిన సకల సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలలోనూ నిర్ణయాత్మక పాత్రను నిర్వహించిన మహోద్యమం భారత కమ్యూనిస్టు ఉద్యమం అని పలువురు కమ్యూనిస్టు నాయకులు, ప్రముఖులు పేర్కొన్నారు. మట్టి మనుషులను మహా నాయకులుగా, సామాన్యులను మాన్యులైన ఉద్యమకారులుగా, ప్రతి ఆద్యము ఎగుడు దిగుడులను ఒడిదుడికులను ఎర్కొంటూ పీడిత ప్రజల పక్షాన నిర్విరామంగా పోరాడుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్పూర్తిదాయకమని వారు కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కందిమళ్ల ప్రతాప రెడ్డి రచించిన రెండు గ్రంధాలను ఆవిష్కరణ సభ ప్రముఖ విప్లవ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్ అధ్యక్షతన శనివారం జరిగింది.
‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉద్యమ ప్రస్థానం’ గ్రంథాన్ని మానవ హక్కుల నాయకుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఆవిష్కరించారు. ‘విప్లవాల విప్లవం’ సంపుటిని సుప్రసిద్ద సాహిత్య పరిశోధకులు, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కే. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కలవేణ శంకర్, ప్రముఖ కవి విమర్శకులు ఏటుకూరి ప్రసాద్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు నరహరి, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మతోన్మాద ఫాసీజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్షిష్ట సామాజిక నేపధ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. కే. శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యమాలతో పాటలు నిర్వహిచే పాత్రను వివరించిన ప్రతాపరెడ్డిని అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ నిర్వహించిన సభ ప్రాంగణంలో ప్రజా నాట్యమండలి గాయకుడు పల్లె నరసింహ గానం చేసిన ప్రతాపరెడ్డి పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ముందుగా నిఖిలేశ్వర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ తొంబై ఏండ్లు పూర్తి చేసుకున్న కందిమళ్ల ప్రతాపరెడ్డి సాహిత్య కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.