calender_icon.png 7 October, 2024 | 8:51 AM

మూసీ ప్రక్షాళన ఆగదు

07-10-2024 02:13:21 AM

ఎవరు అడ్డుకున్నా చేసి తీరుతం

  1. అక్కడి ప్రజలు కంపులోనే బతకాలా? 
  2. వారికి మంచి భవిష్యత్తు అందిస్తాం
  3. మాది వందేళ్ల అనుభవం: సీఎం రేవంత్ 
  4. 1635 మందికి నియామక పత్రాల అందజేత 
  5. 9న ఎల్బీ స్టేడియంలో టీచర్ అభ్యర్థులకు నియామక పత్రాలు.. ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఎవరు అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళ ఆగదని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ వెంట ఉన్న ప్రజలు ఎప్పటికీ ఆ కంపులోనే బ్రతకాలా? అని నిలదీశారు. ప్రభుత్వం ఏ పని చేసినా ప్రతిపక్ష నేతలు కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్య క్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నిమాయక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నిర్మాణాలపై విరుచుకుపడ్డారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, కాళేశ్వరం, రోడ్లు, సచివా లయం ఇలా అనేక నిర్మాణాలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘మీరే కడితిరి. మీరే మింగితిరి. మీరు ఉండగానే కూలిపాయె’ అని కాళేశ్వరం అవినీతిపై విమర్శలు ఎక్కు పెట్టారు. వాళ్లది (బీఆర్‌ఎస్) పదేళ్ల దుర్మార్గం అయితే.. తమది వందేళ్ల అనుభవం అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ చాలా ఏళ్లపాటు గౌరవం పొందారని, ఇప్పుడు ఆ ముసుగు తొలిగిపోయివటంతో ముఖం చెల్లక బయటకు రావడంలేదని విమర్శించారు. కేటీఆర్, హరీష్‌రావు రోడ్ల మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మూసీని పవిత్ర నదిగా మారుస్తం

మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ఆగదని సీఎం స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆ కంపులోనే బ్రతకాలా? అని ప్రశ్నించారు. మూసీ ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందించవద్దా? అని నిలదీశారు. గంగా, యమున, సరస్వతి పేర్లను పిల్లలకు ఎలా పెట్టుకుంటున్నారో..

మూసీ పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునేలా సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ‘నేను 20 ఏళ్లుటా ప్రజా జీవితంలో ఉన్నా. పేదల దుఃఖం, ఇళ్లు కూలితే ఎంత బాధ ఉంటదో నాకు తెలుసు. మేం ఏం చేసినా కాళ్లలో కట్టెపెట్టి అడ్డుకుంటున్నారు. ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోలేదా? రైతులను కొట్టి బలవంతంగా ఖాళీ చేయించారు.

మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్.. వారి హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల నిర్వాసితుల కోసం ఏమైనా చేశారా? మూసీ బాధితులకు పరిహారం ఇచ్చేందుకు అవసరమైతే మరో రూ.10 వేల కోట్లు అప్పు చేస్తాం. ఆరు నెలలుగా మూసీ ప్రాంతంలోని నివాసాల్లో 33 టీమ్‌లతో సర్వే చేయిస్తున్నాం. వారిని ఒప్పించే ఇండ్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాం’ అని సీఎం వివరించారు.

తెలంగాణ భవిష్యత్‌లో ఇంజినీర్లది కీలక పాత్ర

వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్‌లో ఇంజినీర్లది చాలా గొప్ప పాత్ర కాబోతోందని అన్నారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డు, ఫూచర్ సిటీ, ఫార్మా సిటీ నిర్మాణాల్లో ఇంజినీర్ల పాత్రే కీలకమని పేర్కొన్నారు.

ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాళేశ్వరంపై ఇప్పటికే కమిషన్ విచారణ జరుగుతోందని, అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణంపై అత్యుత్తమ సాంకేతిక నిపుణులను నియమిస్తామని తెలిపారు. డీపీఆర్ లేకుండానే కాళేశ్వరాన్ని నిర్మించారని విమర్శించారు. రూ.1.5 లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీల నీళ్లు వస్తేనే కూలిపోతుందని నిపుణుల కమిటీ తేల్చిందని అన్నారు.   

ఈటల అంగి మారినా.. వాసన మారలే 

మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈటల రాజేందర్ అంగి మారింది కాని.. వాసన మారలేదని దుయ్యబట్టారు. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈటల రాజేందర్ ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలని హితవు పలికారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ కింద చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులో నాటి సీఎం, నేటి ప్రధాని నరేంద్రంమోదీ 64 వేల కుటుంబాలను ఖాళీ చేయించారని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించాలని సూచించారు. 

2015లో నోటిఫికేషన్లు ఇచ్చి.. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?

వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో ఏళ్లపాటు నిర్లక్ష్యం వహించిందని సీఎం విమర్శించారు. తన కూతురు కవిత, బంధువు వినోద్‌కుమార్ ఎన్నికల్లో ఓడిపోతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన కేసీఆర్.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఉద్యోగాల భర్తీలో ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల ఉద్యోగాలు ఊడితేనే యువతకు జాబ్‌లు వస్తాయని తాను ఆ నాడు చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని తెలిపారు. ఇది తమ చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు.

9న టీచర్ నియామక పత్రాలు

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు పదివేల మంది అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సచివాలయంలో ఆదివారం అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.

ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని,  సోమవారం సాయంత్రం లోపు తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లకు చేరతాయని తెలిపారు. నియామక పత్రాలు అందుకునే అభ్యర్థులు 9వ తేదీ మధ్యాహ్నం ౨ గంటల లోపే ఎల్బీ స్టేడియానికి చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు.

అభ్యర్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు కేటాయించిందని తెలిపారు. ప్రతి బస్సులో ఒక కానిస్టేబుల్, సమన్వయ అధికారి అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లా నుంచి వచ్చే హైదరాబాద్‌కు చేరుకునే బస్సుల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నామని, వర్షం కురిసే అవకాశం ఉన్నందున సభా వేదిక వద్ద రెయిన్ ప్రూఫ్ షామియానా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చా మని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిందని, తాము సమస్యను పరిష్కరించి ఇప్పుడు ఆర్డర్ కాపీలను అందజేశామని తెలిపారు.

మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారమే నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, సీఎస్ శాంతి కుమా రి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.