calender_icon.png 22 December, 2024 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రక్షాళన ఆగదు

06-10-2024 01:00:53 AM

బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం

ఎంపీలు చామల, మల్లు రవి, సురేష్ షెట్కార్

నాగోల్‌లో మూసీ పరీవాహక ప్రాంత రైతులతో సమావేశం

ఎల్బీనగర్, అక్టోబర్ 5: నాగోల్‌లోని శుభం గార్డెన్‌లో శనివారం ‘మూసీ ప్రక్షాళన చేద్దాం.. రైతులను కాపాడకుందాం’ అనే అంశంపై ఉమ్మడి నల్లగొండ,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోని మూసీ పరీవాహక రైతులతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎంపీలు.. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే సురేష్ షెట్కార్  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం మూసీ ప్రక్షాళన చేపట్టడం లేదని.. కేవలం హైదరాబాద్ ప్రజల కోసం, ఉమ్మడి నల్లగొండ రైతుల కోసం మూసీ ప్రక్షాళనకు పూనుకుందన్నారు. 30 ఏళ్లగా మూసీ ప్రక్షళన చేపడతామని అన్ని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ  ఏ ప్రభుత్వం ఆచరణలో పెట్టలేదన్నారు. మూసీ కాలుష్యంతో ఏండ్లుగా మగ్గుతున్న పేదలను తీసుకెళ్లి డబుల్ బెడ్‌ర్రూం ఇళ్లలో చేరుస్తున్నామని ఇందులో తప్పేముందని వారు ప్రశ్నించారు.

భువనగిరికి గోదావరి జలాలు తీసుకొస్తాం..

సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్లుగా వ్యర్థాలతో కలుషితమైన మూసీని క్లీన్ చేసి... భువనగిరికి గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, దీంతో ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతీ పథకంపై బీఆర్‌ఎస్ నేతలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదిఏమైనా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తామన్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ద్వారా జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.

అసత్య ప్రచారం మానుకోవాలి..

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిల కోసం మూసీ ప్రక్షాళన చేయడం లేదని, హైదరాబాద్ ప్రజల మంచి కోసం చేస్తోందన్నారు.  మూసీ ప్రాజెక్టు పూర్తి అవ్వకముందే.. రాహుల్ గాంధీకి డబ్బులు మూడుతున్నాయని కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లలో చేయని పనులు రేవంత్ రెడ్డి పది నెలలో చేశారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూంతో పాటు రూ.25వేలు ఇస్తున్నామని తెలిరు.

పార్టీలకతీతంగా సహకరించాలి.. 

సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు మూసీలో స్వచ్ఛమన నీరు ప్రహించేదని, కానీ ఇప్పుడు మూసీ నది పక్కన కాళ్లు పెట్టే పరిస్థితి లేదు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పండించే వడ్లు, కూరగాయలు తినే పరిస్థితి లేదు. మూసీ సుందరీకరణ గొప్ప కార్యక్రమమమని, పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. 

రైతులు బాగుపడొద్దా.. 

 తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. మూసీని సుందరీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయనారు. మూసీ శుద్ధి చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.  

కేబుల్ ఆపరేటర్ కోట్లు ఎలా సంపాదించాడు..

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోట్లకు ఎలా అధిపతి అయ్యాడని ప్రశ్నించారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో భూములను కబ్జా చేసి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మూసీ ప్రాజెక్ట్ చైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డి రూ.1,000 కోట్లు ఎప్పుడు ఖర్చు చేశాడు.. ఎంతమందికి పునరావాసం కల్పించాడో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీపై ప్రభుత్వ ప్రణాళిక గురించి సీఎం ఇప్పటికే క్లియర్‌గా వివరించారని పేర్కొనారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డ్డి రంగారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, శోభారాణి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, వెంకన్నయాదవ్, శంకర్‌నాయక్, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

దుష్ప్రచారం తిప్పికొట్టాలి..  

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..1990 నుంచి మూసీ నది కాలుష్యానికి గురవుతోందని..  బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని అబద్ధాలు చెప్పించినా ప్రజలు నమ్మే పరిస్థిలో లేరన్నారు.  మూసీ ప్రక్షాళనతో దాని పరీవాహక ప్రాంతాల్లో ఉండే 25 లక్షల కుటుంబాలు బాగుపడతాయని పేర్కొన్నారు. మూసీ వల్ల ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు.