calender_icon.png 26 December, 2024 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకు డబ్బు కట్టలేదని తల్లి కిడ్నాప్

08-11-2024 12:27:22 AM

మహారాష్ట్ర నుంచి వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు

కిడ్నాపర్ల చెర నుంచి విడిపించిన పోలీసులు

సిరిసిల్ల, నవంబర్ 7 (విజయక్రాంతి): కొడుక్కు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడి తల్లిని ఓ వ్యాపారి కిడ్నాప్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో కలకలం రేపింది. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని కొడుముంజ ఆర్‌అండఆర్ కాలనీకి చెందిన పల్లపు శ్రీనివాస్‌తో పాటు వెంకటేష్‌తో మహారాష్ట్రకు చెందిన లాలు వాగోరావ్ దయారంగ లోడ్ నింపేందుకు లేబర్ల అవసరం నిమిత్తం ఒప్పందం కుదుర్చుకున్నాడు.

వారికి ఇచ్చినప్పటికీ లేబర్లను సమకూర్చలేదు. దీంతో వారి మధ్య గొడవలు తలెత్తాయి. ఎలాగైనా డబ్బులు  వసూల్ చేయాలనే ఉద్దేశంతో వాగోరావ్ తన భార్య పంచతులతో పాటు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బుధవారం కొడుముంజ ఆర్ అండఆర్ కాలనీలోని పల్లపు శ్రీనివాస్ ఇం టికి చేరుకున్నారు. ఇంటి వద్ద పల్లపు శ్రీనివాస్ లేకపోవడంతో అతని తల్లి బీమాబాయిని కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తీసుకెళ్లారు. బాధితురాలి మనవడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రెండు బృందాలుగా ఏర్పడి, నాందేడ్‌కు వెళ్లి గురువారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరా రీలో ఉన్నారని సీఐ వెల్లడించారు. బీమాబాయిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్టు తెలిపారు. కాగా 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించి, మహిళను కాపాడిన వేములవాడ టౌన్ పోలీసులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.