calender_icon.png 1 November, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడల్ని గెంటేసిన అత్తామామ

11-08-2024 12:05:00 AM

  1. భర్త సంవత్సరికం నిర్వహించకుండా ఇంటికి తాళం వేసిన వైనం 
  2. బయటే నిర్వహించిన కోడలు

హుజూరాబాద్, ఆగస్టు 10: కొడుకు మరణానంతరం కోడల్ని గెంటేసిన అత్తామామ.. భర్త సంవత్సరికం చేసుకునేందుకు వీలులేకుండా ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రావుల మంజుల, సురేందర్ దంపతుల కూతురు రవళిని, హుజూరాబాద్‌కు చెందిన వీరగోని మొగిలి, లచ్చమ్మల కుమారుడు శ్రావణ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రావణ్ క్యాన్సర్‌తో బాధపడుతూ 2023 ఆగస్టు 23న మరణించాడు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రవళి అత్తమామల రూపంలో మరో నరకం చూవిచూసింది.

శ్రవణ్ మరణానంతరం రవళిని అత్తమామ.. తన కొడుకే లేనప్పుడు నీతో మాకేంటి అంటూ బయటకు గెంటేశారు. దీంతో పాటు సంవత్సరంపాటు ఇల్లు వదిలేయాలని చెప్పడంతో రవళి కూడా చేసేదేమీ లేక వేరేచోట అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగించింది. తమను  చేరదీయాలని విజ్ఞప్తి చేసినా అత్తామామ వినలేదు. దీంతో దొరికిన పని చేసుకుంటూ పిల్లలను సాకింది.

శనివారం తన భర్త శ్రవణ్ సంవత్సరికం కార్యక్రమానికి కూడా రవళిని రానివ్వకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో అత్తగారి ఇంటి ఎదుటే భర్త ఫొటో ఉంచి సంవత్సరికం చేసింది. తనకు న్యాయం చేయాలని మీడియా ముందు వెళ్లబోసింది. చిన్న పిల్లలతో రవళి సంవత్సరికం నిర్వహించడం చూసిన చుట్టుపక్కల జనాలు సైతం బాధాతప్త హృదయంతో ఆమెకు మద్దతుగా నిలిచారు.