calender_icon.png 2 October, 2024 | 4:02 PM

అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యే!

02-10-2024 01:38:09 AM

  1. సామాజిక బాధ్యత అందరికీ ఉండాలి
  2. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): వర్సిటీలు, విద్యార్థులు పరిశోధనలతోపాటు తమ వంతుగా సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని, ఆ దిశగా పనిచేస్తారని ఆశిస్తున్నానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మంగళవారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 24వ స్నాతకోత్సవంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాంతో కలిసి గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చేందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని చెప్పారు. వ్యక్తిగత జీవితాల్లో విజయం సాధించడానికే కాకుండా, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, చుట్టూ ఉన్న వారి అభివృద్ధికి విద్య ఉపయోగపడాలని కోరారు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆపొద్దని, పరిమితులు లేకుండా కలలు కనాలని, వాటిని సాకారం చేసే దిశగా కష్టపడాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు.

క్రమశిక్షణ, ఉన్నత విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. చదువును పూర్తి చేసుకొని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారని, భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. ఏఐసీటీఈ చైర్మన్ సీతారాం మాట్లాడుతూ.. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలను సృష్టించేలా ఆలోచనలు ఉండాలని పేర్కొన్నారు.

సాంకేతికతలో పెను మార్పు లు వస్తున్నాయని, వాటికనుగుణంగా ఆలోచనలు, పరిశోధనలుండాలని తెలిపారు. ఈ సందర్భంగా 236 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో సహా మొత్తం 1,746 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్త మ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చాన్స్‌లర్ జస్టీస్ నర్సింహారెడ్డి, వీసీ ప్రొఫెసర్ బీజే రావు, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.